ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులొస్తున్నాయ్‌

21 Jul, 2017 22:35 IST|Sakshi
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులొస్తున్నాయ్‌

పెనుకొండ: ప్రజా, రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు, రైతులు తిరగబడే రోజులు ఎంతో దూరం లేవని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమాలో అవినీతిని నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్‌సర్కిల్లో డీసీసీ కార్యదర్శి కేటీ.శ్రీధర్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కాని బీమా కాని సక్రమంగా అందించిన పాపాన పోలేదన్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనేక మంది టీడీపీ నాయకులు పంట పెట్టకపోయినా ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేశారని, పంట పెట్టిన వారికి పరిహారం అందలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారన్న అక్కసుతో రైతులకు అన్యాయం చేశారన్నారు. రొద్దం మండలం బూచెర్లకు చెందిన పలువురు రైతుల అక్రమాల జాబితాను చదివి వినిపించారు.

జన్మభూమి కమిటీల పేరుతో బ్రోకర్లు పర్సెంటేజీలు దండుకోవడానికే ఈ అక్రమాలకు తెరలేపారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో లక్షల కోట్లు, మంత్రులు వేల కోట్లు, ఎమ్మెల్యేల  స్థాయిలో వందల కోట్లు, జన్మభూమి కమిటీలు వేలు,లక్షలు దోచుకుంటున్నారన్నారు. గత ఏడాది రెయిన్‌గన్ల పేరుతో వందల కోట్లు దోపిడీ జరిగిందని, ఒక్క ఎకరా కూడా బతికించలేకపోయారని, మళ్ళీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెయిన్‌గన్ల జపం వల్లించడం దోపిడీ చేయడానికేనన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మూర్తిని కలిసి ఇన్‌పుట్‌ సబ్సిడీలో తలెత్తిన లోపాలను వివరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కోటాసత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులు గుట్టూరు చినవెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు