కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు రీ డిజైన్లు

5 Jul, 2016 09:22 IST|Sakshi

2013 చట్టమే రైతులకు శ్రీరామరక్ష
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
 
మహబూబ్నగర్:
‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే సోయి లేని ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకునేందుకు దళారీగా మారి భూ దోపిడీకి పాల్పడుతోంద’ని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని పాలమూరు ఎత్తిపోతల పథకం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసిత రైతాంగంతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద రైతుల జీవితాలను కాపాడాలన్న సంకల్పంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టి నిరంకుశ ముఖ్యమంత్రి నాలుగు గోడల మధ్య నాలుగు పేజీల జీఓ నం. 123ని తీసుకువచ్చారని విమర్శించారు. రాజ్యాంగ రక్షకుడే భక్షకుడిగా మారి పేద రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల రీడిజైన్ చేసి రూ.వేల కోట్లలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి కుట్రపన్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండి 2013 భూ సేకరణ ప్రకారం పేద రైతులకు పరిహారం వచ్చే వరకు వారి ముందుండి పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైన్ల పేరుతో ప్రాజెక్టుల వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులను పెడుతున్న ఇబ్బందులు చూస్తే నాటి రజాకార్ల జమానా గుర్తుకు వస్తుందని చెప్పారు. తరతరాలుగా నమ్ముకున్న భూమిని సాదా కాగితాలపై సంతకాలు తీసుకొని పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, భూములు పోతాయన్న బాధతో గిరిజన, హరిజన రైతాంగం గుండెపోటుతో మృతి చెందిన ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు పేదల రైతుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు పూనుకోవడం సరికాదన్నారు.

ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కర్వెన సభలో ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి మొదటి నెల జీతం ఇచ్చాకే పనులు ప్రారంభిస్తామని రైతులను బెదిరించే కార్యక్రమానికి పూనుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు అద్దంకి దయాకర్, పవన్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, జెడ్పీటీసీలు సుధాపరిమళ, మణెమ్మ, నాయకులు బాలరాజుగౌడ్, మాన్యనాయక్, సంపత్‌రెడ్డి, రైతులు లక్ష్మణ్, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు