‘కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లింది అందుకే’

2 Jan, 2017 18:19 IST|Sakshi
‘కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లింది అందుకే’

సూర్యాపేట: పెద్ద నోట్ల రద్దు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ వెళ్లారను కోవడం పొరపాటని, ఆయన వద్ద ఉన్న బ్లాక్‌ మనీని మార్చుకునేందుకు ప్రధాన మంత్రి మోదీని కలిశారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్‌ పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ పాలనలో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విసుగు చెందిన ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధవుతోందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, పెద్ద మనుష్యులు మాత్రం తమ డబ్బును దర్జాగా మార్చుకున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతోప్రజల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఈనెల ఏడో తేదీన సూర్యాపేటలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నాయకులు జానారెడ్డి తదితరులు హాజరవుతారని అన్నారు.

>
మరిన్ని వార్తలు