కాంగ్రెస్‌లో ఐక్యతారాగం

8 Dec, 2015 22:42 IST|Sakshi
కాంగ్రెస్‌లో ఐక్యతారాగం

- విభేదాలు పక్కకు పెట్టి ఒక్కటవుతున్న గ్రూపులు
- బరిలో నిలిచిన స్థానాల్లో పట్టుసాధించాలని టీపీసీసీ నాయకుల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్:
స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో క్రమంగా వేడిని పెంచుతున్నాయి. పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో గెలుపుకోసం టీపీసీసీ వ్యూహరచన చేస్తోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో గెలుపుపై ధీమాతో ఉంది. ముందుగా వ్యక్తిగత విభేదాలు, గ్రూపు తగాదాలను పరిష్కరించి ఆయా జిల్లాల్లో ఉన్న గ్రూపులను ఏకం చేయడంపై దష్టి సారించిన టీపీసీసీ అందులో సఫలమైనట్టు కన్పిస్తోంది.

 

ముందుగా అగ్రనేతలు ఉన్న నల్లగొండ జిల్లా నుంచి దీనిని ప్రారంభించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఈ ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.

నల్లగొండలో ఏకాభిప్రాయం..?
టీపీసీసీలో అగ్రనేతలు ఎక్కువగా నల్లగొండ జిల్లాకే చెందిన వారు ఉండడంతో ముందుగా గ్రూపు తగాదాలను అక్కడే పరిష్కరించడం ప్రారంభించింది. జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి, మాజీమంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఎవరికివారే ఒక సొంత అనుచరవర్గానికి నేతత్వం వహిస్తున్నారు. వీరిలో ఏ ఒక్క నాయకునికి రెండో నాయకునితో సఖ్యతలేదు. అయితే, సాధారణ ఎన్నికల తర్వాత వచ్చిన శాసనమండలి ఎన్నికల్లో ఒక్కటయ్యారు. కోమటిరెడ్డి సోదరులతో తీవ్ర విభేదాలు ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి... రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై, ఐక్యతను ప్రదర్శించారు.

 

ఇదే సందర్భంలో కె. అనిల్‌కుమార్‌రెడ్డికి భువనగిరి అసెంబ్లీ టికెట్ ఖరారు చేసుకోగా, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె స్రవంతికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలను అధికారికంగా అప్పగించారు. టీపీసీసీ, సీఎల్పీలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యనేతలు నల్లగొండకే చెందినవారు కావడంతో ఈ జిల్లా ఎన్నిక కాంగ్రెస్‌పార్టీకే కాకుండా ముఖ్యనేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది.

మహబూబ్‌నగర్‌లోనూ కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నారు. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీమంత్రులు డి.కె.అరుణ, జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి తదితరులంతా కాంగ్రెస్ గెలుపును భుజస్కందాలపై వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ గెలుపును ఆ జిల్లాకు చెందిన మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్‌పార్టీలో గ్రూపులుగా విడిపోయిన నేతలంతా ఐక్యతారాగాన్ని ఆలపిస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు