అవార్డు తీసుకునేందుకు వెళ్తూ అనంత లోకాలకు..

5 Feb, 2017 23:12 IST|Sakshi
అవార్డు తీసుకునేందుకు వెళ్తూ అనంత లోకాలకు..

- రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- ప్రమాదస్థలిని పరిశీలించిన ఎస్పీ


విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండే కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్‌(40)ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. పోలీస్‌ శాఖ తరఫున ప్రకటించిన అవార్డును అందుకునేందుకు విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. - కనగానపల్లి (రాప్తాడు)

హిందూపురానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ గోరంట్ల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఒక దోపిడీ కేసులో దొంగలను పట్టుకోవడంలో చూపించిన తెగువకు ఆయనకు పోలీసు శాఖ అవార్డు ప్రకటించింది. సోమవారం విజయవాడలో అవార్డు అందుకోవాల్సి ఉంది. దీంతో తన సమీప బంధువు అయిన మడకశిర మునిసిపల్‌ చైర్మన్‌ ప్రకాష్‌కు చెందిన స్కార్పియో వాహనం తీసుకుని మిత్రుడు రజనీకాంత్‌, కాండీ అనే మరో బాలుడితో కలిసి ఆదివారం సాయంత్రం హిందూపురం నుంచి అనంతపురం బయల్దేరాడు.

మార్గమధ్యంలోని కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపానికి రాగానే ముందు వెళుతున్న గూడ్స్‌ లారీ కంటైనర్‌ అకస్మాత్తుగా జాతీయరహదారి పక్కన ఉన్న పార్కింగ్‌ స్థలం వైపు తిరిగింది. వెనుకనే వస్తున్న స్కార్పియో అదుపు కాక కంటైనర్‌ లారీని మధ్యభాగంలో ఢీకొట్టి దానికిందే ఇరుక్కుపోయింది. డ్రైవింగ్‌ సీటులో ఉన్న కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్‌ వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక వైపు కూర్చున్న రజనీకాంత్, కాండీలు తీవ్రంగా గాయపడ్డారు. కనగానపల్లి పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య గాయత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రమాద స్థలిని పరిశీలించిన ఎస్పీ
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ ప్రేమ్‌కుమార్‌ మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబు హుటాహుటిన సంఘటన స్థలికి వెళ్లారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, సీఐ యుగంధర్‌తో మాట్లాడి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అనంతరం స్కార్పియో వాహనంలోనే ఇరుక్కుపోయి మృతి చెందిన కానిస్టేబుల్‌ మృతదేహాన్ని బయటకు తీయించారు. తర్వాతా కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు.

>
మరిన్ని వార్తలు