మంత్రి గారడీ..కన్సల్టెన్సీ కంపెనీ దోపిడీ

9 Sep, 2017 07:04 IST|Sakshi
గతేడాది సెప్టెంబర్‌లో కన్సల్టెన్సీ ఫీజు చెల్లించమంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో

గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల్లో అవకతవకలు
యూజీడీ, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ ప్రాజెక్టులపై డీపీఆర్‌ సిద్ధం చేసిన కన్సల్టెన్సీపై పురపాలక శాఖ మంత్రి అతి ప్రేమ
గుంటూరు ప్రాజెక్టులో నిబంధనలు మీరి మరీ కన్సల్టెన్సీ ఫీజు చెల్లింపులు
జీవో విడుదల చేసి మరీ ప్రజాధనం చెల్లింపు
గుంటూరు వాసి లోకాయుక్తను ఆశ్రయించడంతో వెలుగు చూసిన వైనం


గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల్లో చేపట్టిన యూజీడీ, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ పనులకు డీపీఆర్‌ రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఓ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారు. నిబంధనల ప్రకారం అంచనా వ్యయంపై ఫీజు నిర్ణయించాల్సి ఉండగా నిర్మాణ సంస్థలు వేసిన టెండర్ల ప్రకారం ఫీజు నిర్ణయించి నిధులు ముట్టజెప్పారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.

సాక్షి, గుంటూరు : రాజధాని నగరాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ పథకాలకు డీపీఆర్‌ తయారు చేసి ఇచ్చిన కన్సల్టెన్సీలపై పురపాలక శాఖ అతి ప్రేమ కనబరిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారు చేస్తే అంచనా వ్యయంపై కాకుండా నిర్మాణ సంస్థలు టెండర్‌ వేసిన ధరపై పర్సంటేజీ చొప్పున కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం (జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యూవల్‌ మిషన్‌) నిధులతో జరిగే ఏ ప్రాజెక్టు పనులకైనా డీపీఆర్‌ తయారు చేస్తే గరిష్ఠంగా రూ. 2 కోట్లు మాత్రమే కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాలనే నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో చేపట్టే యూజీడీ పథకానికి మాత్రం అంచనా వ్యయంపై ఫీజులు చెల్లించి డీపీఆర్‌ తయారు చేసిన కన్సల్టెన్సీపై అతి ప్రేమ కనబరిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కన్సల్టెన్సీకి అనుకూలంగా జీవో..
గుంటూరు నగరంలో జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులపై 2014లో డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారు చేసే బాధ్యతను అధికారులు ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు.  దీనిపై సదరు సంస్థ డీపీఆర్‌ తయారు చేసి ఇవ్వడం, నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించడమూ అన్నీ చకచకా జరిగిపోయాయి. 2016 సెప్టెంబర్‌ 27వ తేదీన కన్సల్టెన్సీ కంపెనీకి గుంటూరు, విజయవాడ నగరాల్లో కలిపి రూ.12.91 కోట్లు ఫీజు చెల్లించాలంటూ ఏపీ యూఎఫ్‌ఐడీసీ ఎండీకి ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నెంబర్‌ 233 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు నగరపాలక సంస్థలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెన్సీకి ఫీజులు చెల్లించాయి. గుంటూరు నగరపాలక సంస్థ రూ.7.69 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థ రూ.5.21 కోట్లు చొప్పున ఫీజులు చెల్లించాయి.

ఎంపీ, మంత్రుల అండదండలతో...
ఫీజు చెల్లించే సమయంలో అప్పటి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఎంత చెల్లింపులు చేయాలనే విషయంపై ప్రభుత్వం నివేదిక కోరింది. యూజీడీ పథకంలో అంచనా వ్యయం రూ.903 కోట్లు ఉండగా నిర్మాణ సంస్థ వేసిన టెండరు, పన్నులు మినహాయించి సుమారు రూ.600 కోట్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆ మొత్తానికే డీపీఆర్‌ తయారు చేసిన కన్సల్టెన్సీకి ఫీజు చెల్లించాలంటూ అప్పటి కమిషనర్‌ లేఖ కూడా రాసినట్లు సమాచారం. తర్వాత అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ కన్సల్టెన్సీకి నష్టం కలుగుతుందని అంచనా వ్యయంపై వారికి ఫీజులు చెల్లించాలంటూ లేఖ రాసినట్లు తెలిసింది.

ఎంపీ లేఖపై చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ పురపాలక శాఖ మంత్రి ఆదేశించినట్లు సమాచారం. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే యూజీడీ పథకానికి అంచనా వ్యయంపైనే కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఏపీ యూఎఫ్‌ఐడీసీ ద్వారా జీఎంసీ, వీఎంసీలు కన్సల్టెన్సీ ఫీజులు చెల్లించాలంటూ జీవో విడుదల చేసింది. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ కన్సల్టెన్సీ ఫీజులు చెల్లించేసింది. అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం ద్వారా జరిగే ఏ ప్రాజెక్టుకైనా డీపీఆర్‌ తయారు చేసే కన్సల్టెన్సీకి గరిష్ఠంగా రూ.2 కోట్లు మాత్రమే ఫీజు చెల్లించాలని నిబంధన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

బిగుస్తున్న ఉచ్చు..
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెన్సీకి అధిక ఫీజులు చెల్లించారంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీనిపై పూర్తి వివరాలు పంపాలంటూ లోకాయుక్త నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు సమాచారం పంపినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలతో పాటు ఉన్నతాధికారుల ప్రమేయం ఉండటంతో ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయంతో అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు.

>
మరిన్ని వార్తలు