విజ్ఞానాన్వేషణ నిరంతర ప్రక్రియ

22 Nov, 2015 04:04 IST|Sakshi
విజ్ఞానాన్వేషణ నిరంతర ప్రక్రియ
♦ రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్‌రెడ్డి వెల్లడి 
కాకినాడ  జేఎన్‌టీయూ నుంచి  డాక్టరేట్ అందుకున్న శాస్త్రవేత్త 
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: యూనివర్సిటీల నుంచి పట్టాలు పుచ్చుకొని బయటకు వెళ్లినంత మాత్రాన విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, విజ్ఞానాన్వేషణ నిరంతరాయంగా కొనసాగాలని  రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సతీష్‌రెడ్డి సూచించారు. కాకినాడ జేఎన్‌టీయూలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎస్‌ఎస్ కుమార్ చేతులమీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్తు అంతా సాంకేతిక రంగానిదేనని, అందుకనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలని చెప్పారు. స్నాతకోత్సవంలో 72 మందికి పీహెచ్‌డీ పట్టాలను, 56 మందికి బంగారు పతకాలను వీసీ కుమార్, సతీష్‌రెడ్డి అందజేశారు. మాజీ వీసీ ప్రొఫెసర్ అల్లం అప్పారావు, రిజిస్ట్రార్ ప్రసాదరాజు, ఓఎస్‌డీ సీహెచ్ సాయిబాబు పాల్గొన్నారు. 
 
 యువతకు అవకాశాలు ఆకాశమంత:‘‘ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, ఎంచుకున్న రంగమేదైనా నిరంతరం విజ్ఞానాన్వేషణ కొనసాగిస్తే ఏ విద్యార్థి అయినా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా నేనెంతో దగ్గర నుంచి చూసిన క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలామే అందుకు తార్కాణం. ఆయన కృషితో సాకారమైన డీఆర్‌డీఓలోని ప్రధాన ప్రయోగశాల రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ)కు డెరైక్టర్‌గా వ్యవహరించే అవకాశం రావడం చాలా గౌరవంగా భావిస్తా. ఒక్కో శతాబ్దంలో ఒక్కో దేశం పెద్దన్న పాత్ర పోషించింది. 21వ శతాబ్దం మాత్రం భారత్‌దేనని చెబుతారు’’ అని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.  కాకినాడ జేఎన్‌టీయూ నుంచి శనివారం గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..  
 
 ‘ప్రైవేట్’తో ఇబ్బందేమీ లేదు 
 ప్రస్తుత పరిస్థితుల్లో మన రక్షణ వ్యవస్థను మరింత శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దుకోవడానికి ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాలి. ఇందుకోసం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పొందడం ప్రమాదమేమీ కాదు. ఇప్పటికే రక్షణ వ్యవస్థకు కావాల్సిన పరికరాల్లో 80 శాతం వరకూ ప్రైవేట్ సంస్థల నుంచే వస్తున్నాయి. అయితే వ్యూహాత్మక, కీలక విభాగాల్లో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లేకుండా ఆంక్షలు ఎలాగూ ఉన్నాయి. 
 
 మన సత్తా చాటాం 
 అంతరిక్ష ప్రయోగాల్లో టాప్-5  దేశాల్లో భారత్ ఒకటి. ఈ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి భిన్న వ్యూహాలతో అంతరిక్ష ప్రయోగాలను విస్తృతం చేసుకోవాలి. విదేశీ ఉపగ్రహాలను ఒకేసారి బహుళ సంఖ్యలో పంపడం ద్వారా మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. 
 
 రాష్ట్రంలో రక్షణ పరిశ్రమలు 
 రక్షణ రంగానికి సంబంధించి అనంతపురం జిల్లా లేపాక్షి వద్ద ‘భెల్’ ఒక యూనిట్‌ను ప్రారంభిం చింది. కర్నూలు జిల్లాలో మరొకటి ప్రారంభిం చాల్సి ఉంది. మూడో యూనిట్ కోసం విజయవాడ-మచిలీపట్నం మార్గంలో 50 ఎకరాలను పరిశీలించారు. అటవీ శాఖ అనుమతులు వస్తే నాగాయలంకలో కూడా యూనిట్ ప్రారంభమవుతుంది. 
మరిన్ని వార్తలు