ప్రాణం ఖరీదు రూ. 5 లక్షలు

30 May, 2016 09:09 IST|Sakshi

రైల్వేకోడూరు: విధి నిర్వహణలో ఉన్న ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడంతో ఆ సంస్థ ప్రతినిధులు స్థానిక పెద్దలతో మధ్యవర్తిత్వం చేసి ప్రాణం ఖరీదు రూ.5 లక్షలుగా నిర్ణయించారు.

వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట గనులలో ఆదివారం త్రివేణి ప్రైవేటు సంస్థకు చెందిన కార్మికుడు కుంచం నారాయణ (55) డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తూ కుప్పకూలాడు. ఇతను డ్రిల్లింగ్ విభాగంలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంకాలం విధులకు వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున డ్రిల్లింగ్ పనిచేస్తూ ఊపిరి ఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. వెంటనే రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా మృతిచెందాడు. ధూళి కాలుష్యంతో ఊపిరాడక చనిపోయాడని కొందరు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని మరికొందరు అంటున్నారు. దీంతో కార్మికుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బికమ్మపల్లె గ్రామానికి చెందిన నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రతిరోజూ చేసే పనుల కంటే అధికంగా చేయాలని డ్రిల్లింగ్ విభాగంలో పనిచేసే కార్మికులను రెండు రోజులుగా ఒత్తిడి అధికమైంది. ఇందులో భాగంగానే డ్రిల్లింగ్ పనులు వేగవంతంలో కార్మికుడు నారాయణ ఊపిరాడక మృతిచెందాడు. మైనింగ్ చట్టాలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయోనని తవ్వకాల కాంట్రాక్టర్ గుండెపోటుగా చిత్రీకరించారు. కాంట్రాక్టర్‌తో ప్రభుత్వ అధికారులు చేతులు కలిపారు. నిరుపేద అయిన మృతుని కుటుంబాన్ని ఓవైపు బెదిరింపులు, మరోవైపు పరిహారంతో మభ్యపెట్టి వాస్తవాలను వక్రీకరించి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
 

మరిన్ని వార్తలు