నిమ్మకునీరెత్తిన ప్రభుత్వం

20 Dec, 2016 00:11 IST|Sakshi

- సమ్మెబాటలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు

–అటకెక్కిన చదువులు

–పూర్తికాని పాఠ్యాంశాలు

- సమీపిస్తున్న వార్షిక పరీక్షలు

–విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

ఉరవకొండ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్లు తమ న్యామమైన డిమాండ్లను పరిష్కరించాలని పలు రూపాల్లో  ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అద్యాపకులను రెగ్యూలర్‌ చేస్తామని హమీ కుడా ఇచ్చారు. మూడేళ్లు కావస్తుఽన్నా ప్రభుత్వంలో స్పందనలేదు.  అటు కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.

అటక్కెక్కిన చదువులు...

డిసెంబరు నుంచి ప్రధాన పరీక్షల వరుకు విద్యార్థికి ఎంతో కీలక సమయం.  మిగిలిన సిలబస్‌ త్వరగా పూర్తి చేయించుకోని, భవిష్యత్‌ పరీక్షలకు సిద్ధమయ్యే పరిస్థితి.  కానీ బోధించే అధ్యాపకలు లేక విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఉరవకొండ, మడకశిర, తాడిమర్రి, అమరాపురం, బొమ్మనహల్, గుడిబండ, గుంతకల్లు తదితర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 50 శాతానికిపైగా  కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన జరిగేది.  ఇందులో సైన్స్‌ సబ్జెక్టులను బోధించేవారు లేక విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఒక వైపు జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌,  మరోవైపు ఈనెలాఖరులోగా సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఉదాహరణకు ఉరవకొండ బాలుర, బాలికల కళాశాలలు మొత్తం 90 శాతం కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేసుత​ఆన్నరు. వీరు సమ్మెలో వెళ్లి నప్పటి నుంచి ప్రిన్సిపల్‌ ఒక్కరి మీదే బోధన బాధ్యత పడింది. ఇంకా ఇప్పటికి ఎంపీసీ, బైపీసీ గ్రూపు సిలబస్‌ కుడా పూర్తి కాలేదు.

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల డిమాండ్లు..

 –ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు లెక్చరర్లందరినీ క్రమబద్ధీకరించాలి.

- ఇది అమలయ్యే దాకా   రెగ్యూలర్‌ అధ్యాపకులతో సమానంగా పీఆర్సీ సిఫారస్సు మేరకు వేతనాలు పెంచాలి.

–ఏటా కొనసాగుతున్న బాండ్‌ విధానాన్ని రద్దు చేయాలి.

-   12 నెలల వేతనం, విద్యార్థి ఉత్తీర్ణత శాతంలో మినహాయింపు చేయాలి.

సిలబస్‌ పూర్తి కాలేదు:

ఫస్ట్‌ ఇయర్‌లో సిలబస్‌ సకాలంలో పూర్తి చేయడం వల్ల  మంచి స్కోరు చేయగలిగాను, రెండవ సంవత్సరంలో కుడా కష్టపడి చదువుదామంటే ఇంకా సిలబస్‌ 20 శాతం పూర్తి కావాల్సి వుంది. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. పరీక్షల్లో ఉత్తమ ఫలితాల ఎలా సాధించాలి?

 - మోహెతాజ్, ఎంపీసీ, రెండవ సంవత్సరం,ఉరవకొండ

ప్రాక్టికల్స్‌ను ఎలా ఎదుర్కోవాలో...?

ప్రస్తుతం జంబ్లింగ్‌ పద్ధతిలో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. లెక్టరర్లు లేక ఇప్పటి వరకూ ప్రాక్టికల్స్‌ నిర్వహించలేదు. జనవరి నుంచి ఈ పరీక్షలు ఉన్నాయి. ప్రభత్వం లెక్చరర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంది.

 తేజస్వీని, బైపీసీ, ఉరవకొండ

 ఇబ్బందికరంగా ఉంది...

కాంట్రాక్టు అధ్యాపకులు  సమ్మెలో వెళ్లడంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. అందరినీ చెట్టుకింద కూర్చోబెట్టి బోధించాల్సిన పరిస్థితి ఉంది. బాలురు, బాలికల కళాశాలలో వెయ్యి మంది దాకా విద్యార్థులు ఉన్నారు. ఇదే పరిస్థితి ఉంటే  ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం  ఉంది.

- నరసింహం, ఇంటర్‌ బాలుర, బాలికల కళాశాల ప్రిన్సిపాల్, ఉరవకొండ

 హమీను నేరవేర్చాలి...

టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు అద్యాపకులకు రెగ్యూలర్‌ చేస్తామని గతంలో హమీ ఇచ్చింది. ఈహమీ ప్రకారం తమకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉపసంఘం వేసి కాలయాపన చేయడం సరైంది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి.

  - ఎర్రప్ప, జూనియర్‌ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

మరిన్ని వార్తలు