నిర్మల్ జిల్లా ఏర్పాటుకు సహకరించండి

10 Jun, 2016 01:06 IST|Sakshi
నిర్మల్ జిల్లా ఏర్పాటుకు సహకరించండి

 మంత్రికి జిల్లా సాధన సమితి వినతి
 
నిర్మల్‌రూరల్ :  నిర్మల్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుకు స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకరించాలని నిర్మల్ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పట్టణంలోని మంత్రి స్వగృహానికి సమితి సభ్యులు తరలివచ్చారు. ఆయన హైదరాబాద్‌లో జిల్లాలపై సమావేశానికి తరలివెళ్లడంతో పీఏ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్లు నంగె శ్రీనివాస్, నాయిడి మురళీధర్ మాట్లాడుతూ సీఎం ముఖ్యమంత్రి బుధవారం కలెక్టర్ల సమావేశంలో పేర్కొన్న విధంగా నిర్మల్ జిల్లాకు కావాల్సిన అన్ని అర్హత లూ ఉన్నాయన్నారు.

ముథోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలతోపాటు బోథ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు నిర్మల్ జిల్లా కేంద్రంగా అనుకూలంగా ఉందన్నారు. అవసరమైతే నిజామాబాద్‌లోని సరిహద్దు ప్రాంతాలను కలిపైనా నిర్మల్‌ను జిల్లాగా ప్రకటించేలా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చూడాలన్నారు. ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల ప్రజల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కోశాధికారి గంగిశెట్టి ప్రవీణ్, కోకన్వీనర్లు డాక్టర్ కృష్ణంరాజు, ముక్కా సాయిప్రసాద్, నూకల గురుప్రసాద్, అబ్ధుల్ అజీజ్, కోటగిరి గోపి, డాక్టర్ కృష్ణవేణి, బొద్దుల అశోక్, అంక శంకర్, కార్యవర్గ సభ్యులు కూన రమేశ్, నారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు.


 ఫోన్ ద్వారా ఎమ్మెల్యేలతో..
 జిల్లాల ఏర్పాటుపై గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం ఉన్నందున నిర్మల్ జిల్లా సాధన సమితి నూతన జిల్లా కోసం ప్రజాప్రతినిధులకు విన్నవించింది. సాధన సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి ఫోన్ ద్వారా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో మాట్లాడి, జిల్లా ఏర్పాటు అవశ్యకతను వివరించారు. సీఎంతో సమావేశంలో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై మాట్లాడాలని కోరారు. అలాగే సాధన సమితి కోకన్వీనర్ డాక్టర్ యు. కృష్ణంరాజు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో మాట్లాడారు. ఈమేరకు ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
 

మరిన్ని వార్తలు