పంచాయితీ!

19 Aug, 2017 01:19 IST|Sakshi
పంచాయితీ!

విజిలెన్స్‌ ఏడీ బదిలీకి పట్టు
భూగర్భ గనుల శాఖలో కలకలం
గ్రానైట్‌ మాఫియా తీరు వివాదాస్పదం
ఇప్పటికే ఏడీకి జేసీ అనుచరుడు రవీంద్రరెడ్డి తరపున లీగల్‌ నోటీసు
తాజాగా ఓ పెద్దమనిషి వద్దకు వ్యవహారం
నంద్యాల ఎన్నికల తర్వాత చూద్దామని హామీ


గ్రానైట్‌ మాఫియా బరితెగిస్తోంది. అడ్డొస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించని పరిస్థితి. ఆదాయానికి గండి పడుతుందనుకుంటే.. అధికారులను ముప్పుతిప్పలు పెట్టడం పరిపాటిగా మారుతోంది. నిజాయితీ అంటే.. మరీ చెలరేగిపోవడం, దారికి రాకపోతే.. బదిలీకి పట్టుపట్టడం వీరి నైజం. ఇక పెద్దాయన అండ ఉండనే ఉంది. ఇంకేముంది.. ఇక్కడ ఉద్యోగం అంటే ముళ్ల కిరీటమే.

అనంతపురం: తాడిపత్రి కేంద్రంగా కొన్నేళ్ల నుంచి గ్రానైట్‌ మాఫియా చెలరేగిపోతోంది. వీళ్లు చెప్పిన క్వారీల నుంచే వ్యాపారులు రాళ్లు కొనుగోలు చేయాలి? చెప్పిన లారీలనే లోడింగ్‌కు పంపాలి? అడిగినంత ముట్టజెప్పాలి? లేదంటే వ్యాపారం మూత వేసుకోవాల్సిందే. ఆ ప్రాంతంలోని ఓ పెద్ద మనిషి అండతో కొన్నేళ్లుగా ఈ మాఫియా దందా సాగిస్తోంది. అయితే విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. తనదైన శైలిలో దందాకు చెక్‌ పెట్టడంతో.. అవినీతి బురదచల్లి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు ప్రాణహాని ఉందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత కూడా ‘మాఫియా’ తీరులో మార్పు లేకపోయింది. పైగా ప్రతాప్‌రెడ్డిని ఎలాగైనా బదిలీ చేయించాలని పెద్దమనిషి వద్ద పంచాయితీ పెట్టారు. అందుకు ఆయన కూడా తలూపినట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో 670 దాకా గ్రానైట్‌ మిషన్లు ఉండగా.. వీటికి మడకశిర, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి గ్రానైట్‌ రాళ్లు వస్తున్నాయి. తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడా క్వారీలు లేవు. అయినా ఇక్కడ గ్రానైట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. పదుల సంఖ్యలోని మిషన్లు చూస్తుండగానే వందల్లోకి చేరాయి. గ్రానైట్‌ వ్యాపారులు కళ్లెదుట కోట్లకు పడగలెత్తారు. భారీ భవంతులు నిర్మించారు.

ఇవన్నీ గమనించిన ఓ పెద్దమనిషి కన్ను గ్రానైట్‌ వ్యాపారంపై పడింది. ఈ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని అనుచరులను ఉసిగొలిపారు. వీరంతా మాఫియాగా ఏర్పడి.. మొదట భూగర్భ గనుల శాఖ అధికారులను మచ్చిక చేసుకుని, ఆ తర్వాత వ్యాపారులు తమ కనుసన్నల్లో మెలిగేలా దారికి తెచ్చుకున్నారు. అప్పటికే సాగుతున్న జీరో వ్యాపారానికి కప్పం కట్టాలని ఆదేశించారు. లేదంటూ వ్యాపారం నడవదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చేసేది లేక వ్యాపారులంతా ‘జీ హుజూర్‌’ అనేశారు. ఇలా.. రెండేళ్ల పాటు వీళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యాపారం సాగింది. ఆగస్టు 21, 2015లో గుత్తి విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రడ్డి బాధ్యతలు చేపట్టాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ప్రతాప్‌రెడ్డికి బెదిరింపులు
ఏడీ ప్రతాప్‌రెడ్డి రెండేళ్లుగా తనిఖీలు చేసి భూగర్భ గనుల శాఖ ఆదాయాన్ని భారీగా పెంచారు. దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. దీన్ని తాడిపత్రి, అనంతపురంలోని భూగర్భగనులశాఖ అధికారులు కొందరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ప్రతాప్‌రెడ్డిని లొంగదీసుకునేందుకు విఫలయత్నం చేసిన గ్రానైట్‌ మాఫియా.. మైనింగ్‌ అధికారులతో చేతులు కలిపి ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించేందుకు యత్నించారు. అవినీతి ఆరోపణలు చేయించారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులు కొట్టిపారేశారు. ఆ తర్వాత బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రతాప్‌రెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఐదుగురు పేర్లతో ఉన్నతాధికారులకు ఈ నెల 2న లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
 
ఫిర్యాదు తర్వాత బదిలీపై పట్టు
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రరెడ్డి పేరు కూడా ఏడీ ఫిర్యాదులో ఉంది. స్టీఫెన్‌ రవీంద్ర హయాంలో ఇతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చారని అందులో పేర్కొన్నారు. దీనిపై రవీంద్రరెడ్డి.. ప్రతాప్‌రెడ్డికి లీగల్‌ నోటీసు పంపారు. తనకు కౌన్సెలింగ్‌ ఇవ్వలేదని నోటీసులో స్పష్టం చేశారు. ఈ తతంగం తర్వాత ప్రతాప్‌రెడ్డి వైజాగ్‌ వెళ్లిపోయారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆయన పరిధిలోని కొన్ని కోర్టు కేసులకు సంబంధించి కొద్దిరోజులుగా వైజాగ్‌లోని ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రతాప్‌రెడ్డి బదిలీ అయ్యారనే ప్రచారం గ్రానైట్‌ వ్యాపారుల్లో నడిచింది. లాంగ్‌లీవ్‌లో వెళ్లారని, ఇక తిరిగి విధులకు హాజరు కారని కూడా ఓ వర్గం ప్రచారం చేస్తోంది.

అయితే ప్రతాప్‌రెడ్డి ఆన్‌డ్యూటీలో వెళ్లారని.. తిరిగి విధులకు హాజరుకానున్నారని తెలిసి.. గ్రానైట్‌ మాఫియా ఓ పెద్దమనిషి వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో భూగర్భగనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావుతో మాట్లాడి ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయిస్తానని సదరు పెద్దమనిషి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే ప్రతాప్‌రెడ్డి విషయంలో ఉన్నతాధికారులు పూర్తి సానుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతాప్‌రెడ్డి నిజాయితీకి బదిలీ బహుమానంగా ఇస్తారా? లేదంటే ఒత్తిళ్లను తోసిపుచ్చి కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు