వంటంతా ఒకే చోట..!

28 May, 2017 23:17 IST|Sakshi
వంటంతా ఒకే చోట..!
- 20 కిలోమీటర్లకో పాకశాల ఏర్పాటు యోచన
- అక్కడి నుంచే పాఠశాలలకు మధ్యాహ్నభోజనం
- జిల్లాలో ఐదు క్లస్టర్లలో అమలుకు సన్నాహాలు
రాయవరం (మండపేట) : ‘మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. అన్నంలో పురుగులు ఉంటున్నాయి. మెనూ ప్రకారం గుడ్డు వడ్డించడం లేదు..’ ఇలాంటివే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై వినిపిస్తున్న విమర్శలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు వివిధ సందర్భాల్లో జిల్లాలో ఏదో ఒక మూల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంలో మార్పులకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రభుత్వం 524339/ప్రోగ్రామ్‌.1/ఎ1/2017 తేదీ 19–04–2017తో మెమో విడుదల చేసింది. 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 4,189 ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్‌ పాఠశాలల్లో దాదాపుగా రోజుకు 2.80 లక్షల మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. జకొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు వండి సరఫరా చేస్తుండగా, చాలా పాఠశాలల్లో మిడ్‌డే మీల్‌ వర్కర్లు వండి వడ్డిస్తున్నారు.  
ప్రతి క్లస్టర్‌లో 25 వేల మందికి వంట
ఇకపై ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక భారీ వంటశాల  ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకూ భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, అమలాపురం, రామచంద్రపురంలలో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి క్లస్టర్‌లో సుమారు 25 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయనున్నారు. ఉదాహరణకు రామచంద్రపురంలో వంటశాలను ఏర్పాటు చేసి దాని పరిధిలోని 25 వేల మందికి భోజనం తయారు చేసి అక్కడి నుంచి వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఎప్పుడు తయారైన భోజనం అప్పుడే ప్యాకింగ్‌ చేసి పంపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు ప్రతి క్లస్టర్‌కు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. అవసరమైన స్థలాలను ఐదు క్లస్టర్లలో గుర్తించాలని కలెక్టర్‌కు విద్యాశాఖ నివేదించింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాల హెచ్‌ఎంతో పాటు మండల విద్యాశాఖాధికారి ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు. వంటశాలల ఏర్పాటు తర్వాత వాటి సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఫలితంగా డివిజన్, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.  
మెనూ ప్రకారమే భోజనం..
ప్రభుత్వ ఆలోచన పూర్తి స్థాయిలో అమలైతే నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందనుంది. వంటశాలలు లేవని, వర్షం కురుస్తోందని, బిల్లులు చెల్లించక పోవడంతో భోజనం అందించడం ఇబ్బందిగా మారుతుందనే మాటలు వినిపించే అవకాశం ఉండదు. ప్రతి వారం తప్పనిసరిగా రెండు గుడ్లు అందించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన భోజనం తయారవుతుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 
వర్కర్లకు ప్రత్యామ్నాయమెలా..
మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న మహిళలు భారీగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో మిడ్‌డే మీల్‌ వర్కర్లు భోజనం తయారు చేసి వారికి వడ్డిస్తున్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది మిడ్‌డే మీల్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.1,000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. నూతన విధానం అమలు జరిగితే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వంటశాలల్లో భోజనం తయారీతో పాటు ప్యాకింగ్, ఇతర పనుల్లో వీరిని వినియోగించుకోనున్నా..అందరికీ ఉపాధి సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. 
అంచనాలు రూపొందిస్తున్నాం..
ప్రతి 20 కిలోమీటర్లకో వంటశాల ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నాం. వంట తయారు చేయడానికి అవసరమైన భవనాల నిర్మాణానికి అనువైన స్థలం కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. 
– ఎస్‌.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి 
మరిన్ని వార్తలు