ఆలయ పనుల్లోనూ అక్రమాలు

27 Jul, 2016 18:25 IST|Sakshi
ఆలయ పనుల్లోనూ అక్రమాలు
  • నాణ్యత లేకుండా రంగులు
  • వారం రోజులకే వెలిసిపోతున్న వైనం
  • పట్టించుకోని అధికారులు 
  •  
    పుష్కరాల సందర్భంగా ఆలయాల అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల్లో భారీ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆలయాల కార్యనిర్వహణాధికారులకు ఎటువంటి పర్యవేక్షణ బాధ్యతలు లేకపోవడంతో వారు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆలయాల అభివృద్ధి్ధ పనుల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్‌లకు ఇష్టారాజ్యంగా మారింది. తూతూమంత్రంగా పనులు చేస్తు నాసిరకం మెటీరియల్‌ వాడుతున్నారు. అయా పనులు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా ఆలయాల అభివృద్ధి పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు సబ్‌ కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. సబ్‌కాంట్రాక్ట్‌ పొందిన వారు మరొక్కరికి పనులను అప్పగించారు. దీంతో పనులు చేతులు మారడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. అభివృద్ధి ఏయే పనులు చేయాలో స్థానికులకు, అర్చకులకు తెలియకుండా ఉంది. దీంతో కాంట్రాక్టర్‌ల ఇష్టారాజ్యమైంది. 
     
    దావులూరు(కొల్లిపర–గుంటూరు):
    కృష్ణా పుష్కరాల సందర్భంగా మండలంలోని దావులూరులో అతి పురాతనమైన, ప్రసిద్ధి చెందిన శ్రీ గోకర్ణేశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అభివద్దికి రూ. 2 లక్షలను కేటాయించారు. అభివృద్ధి భాగంగా చిన్నచిన్న మరమ్మతులు, రంగులు వేయాల్సి ఉంది. కాంట్రాక్టర్‌ మరమ్మతులేమీ చేయకుండా కేవలం రంగులు మాత్రమే వేశారు. నాణ్యత లేని రంగులు ఉపయోగించడం వల్ల వేసిన కొద్ది రోజులకే అవి వెలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. రంగులు వేసేటప్పుడు రెండేళ్లు గ్యారంటీగా ఉంటాయని చెప్పిన కాంట్రాక్టర్‌ ఇప్పుడు స్పందించడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి జల్లులకు రంగులు కారిపోయి దేవతా మూర్తుల విగ్రహాలు వెలవెల పోతున్నాయి. 
     
    చేయాల్సింది ఇలా...
     
    తొలుత పాత రంగులకు తొలగించి ఆ తరువాత వైట్‌ ప్రమర్‌ కొటింట్‌ ఇవ్వాలి. ఆ తరువాత రెండు సార్లు నాణ్యత కలిగిన రంగులు వేయాలి కాని ఆ విధంగా రంగులు వేయలేదు. అయితే ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో మాత్రం పనులు పూర్తి చేసినట్లు ఇచ్చారు. ఆలయంలో ఉన్న చిన్నచిన్న మరమ్మతులు పూర్తి చేయాలని విన్నవించినా కాంట్రాక్టర్‌ స్పందించడం లేదని ఆలయ అర్చకులు టంగుటూరు రాజేంద్రప్రసాద్‌ చెబుతున్నారు. నాసిరకం రంగులు వాడినందున రంగులు వెలిసిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నాణ్యత లేని పనులు చేయడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
     
    చర్యలు తీసుకుంటాం..
    ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయశాఖ ఏఈ చక్రధర్‌ను వివరణ కోరగా పనులు సక్రమంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. 
     
మరిన్ని వార్తలు