దోపిడీకి రాచబాట

4 Aug, 2016 23:25 IST|Sakshi
దోపిడీకి రాచబాట
  •      అంచనా పెంచి అక్రమాలకు ఆమోదం
  •    తెనాలి–చందోలు రహదారి విస్తరణలో మరో అవినీతి కోణం
  •    కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.కోటి రికవరీని తప్పించేందుకే!
  •  సాక్షి, అమరావతి : ప్రజాధనం దోపిడీకి ఏకంగా సర్కారు రాచబాట వేసిన వైనమిది. 2011లో చేపట్టిన తెనాలి–చందోలు రోడ్డు విస్తరణలో కాంట్రాక్టు సంస్థ అక్రమాలు బయటపడ్డాయి. రక్షణ గోడ నిర్మాణం, రెడీమిక్స్‌ ప్లాంట్‌ వ్యవహారాల్లో అవకతవకలు రూఢీ అయ్యాయి. కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.1.04 కోట్లు రికవరీ చేయాలని సాక్షాత్తూ ఇంజనీరింగ్‌ నిపుణుల కమిటీతో పాటు విజిలెన్స్‌ కమిషనర్‌ తేల్చారు. ఈ అక్రమాలకు ఇప్పుడు ఆమోదముద్ర వేస్తూ పరిపాలన అనుమతుల అంచనాలు పెంచారు. రూ.40 కోట్ల రోడ్డు పనులను రూ.50 కోట్లకు పెంచుతూ ఏకంగా జీవో జారీ చేశారు. 2011లో ఇచ్చిన పరిపాలన అనుమతులకు అంచనా పెంచుతూ ఇప్పుడు జీవో జారీ చేయడం వెనుక ప్రధాన కారణం కాంట్రాక్టు సంస్థకు రికవరీ తలనొప్పులు తప్పించేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా తెనాలి–మంగళగిరి రహదారికి కిలోమీటరు విస్తరణకు గాను సంబంధం లేని తెనాలి–చందోలు రోడ్డుకు పరిపాలన అనుమతులు పెంచుతూ జీవో ఇవ్వడం గమనార్హం. అదీ ఏకంగా కిలోమీటరుకు రూ.10 కోట్లు కేటాయిస్తూ ఐదేళ్ల క్రితం ఇచ్చిన పరిపాలన అనుమతులకు ఈ పనిని జత చేయడం అనుమానాలకు తావిస్తోంది. 
     
    అవినీతి రహదారి క«థాకమామిషు ఇదీ..
    రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో తెనాలి–చందోలు నడుమ 22.600 కిలోమీటరు నుంచి 25.800 కిలోమీటరు వరకు అంటే 3.2 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డుకు, తెనాలి–మంగళగిరి మధ్య 0.00 నుంచి 1.00 కిలోమీటరు వరకు అంటే కిలోమీటరు మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.40 కోట్ల అంచనాతో గతంలో టెండరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. పది శాతం తక్కువ ధరతో ఓ సంస్థ, పది శాతం ఎక్కువ ధరతో మరో సంస్థ టెండరు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం ఎల్‌1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించాలి. కానీ పది శాతం ఎక్కువ ధరకు టెండరు కోట్‌ చేసిన ఎల్‌2కు పనులు కట్టబెడుతూ టెండరు యాక్సెప్టింగ్‌ అథారిటీ (టీఏఏ) నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లింది. టెండరు దశలోనే అడ్డగోలు అక్రమాలు ఈ విధంగా ఉంటే, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పనులు చేయడంలోనూ అంతులేని అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్‌ సహా ఆర్‌అండ్‌బీలో ఇంజనీరింగ్‌ నిపుణులు తేల్చారు. టెండరు మార్గదర్శకాల ప్రకారం నాలుగు లేన్ల రోడ్డుకు 40 ఎంఎం మెటల్‌తో, 15 ఎంఎం కాంక్రీట్‌తో రిటైనింగ్‌ వాల్స్‌ (అడ్డుగోడలు) నిర్మించాలి. కానీ 20 ఎంఎం మెటల్, 20 ఎంఎం కాంక్రీట్‌ ఉపయోగించి నాసిరకంగా అడ్డుగోడలు నిర్మించినట్లు విజిలెన్స్‌ తేల్చింది. రహదారి విస్తరణలో ఒప్పందానికి బదులు ఇతర మెటీరియల్‌ వాడకం, బ్యాచ్‌ మిక్సింగ్, మెషీన్‌ మిక్సింగ్‌ రేట్లలో తేడాలను గుర్తించింది. దీనివల్ల కాంట్రాక్టరుకు బిల్లుల రూపంలో భారీగానే చెల్లించినట్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.1.04 కోట్లు రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి తాఖీదులిచ్చింది. 
     
    ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ ఏమంటున్నారంటే...
    ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గంగాధరం వివరణనిస్తూ రికవరీపై కాంట్రాక్టు సంస్థ నాగభూషణం అండ్‌ కోకు నోటీసులిచ్చామని, కాంట్రాక్టు సంస్థ కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. అప్పటి రోడ్డు విస్తరణ, రక్షణ గోడ నిర్మాణంలో ఇరిగేషన్‌ శాఖ కొంత పని వదిలేసిందని, ఆ పనిని పూర్తి చేసేందుకు తాజాగా పరిపాలన అనుమతులిచ్చామని తెలిపారు.  
     
మరిన్ని వార్తలు