అవినీతి రహితంగా మోడల్‌ పోలీసుస్టేషన్లు

4 Feb, 2017 23:54 IST|Sakshi
అవినీతి రహితంగా మోడల్‌ పోలీసుస్టేషన్లు
 
 
డీజీపీ నండూరి సాంబశివరావు 
 
గుంటూరు ఈస్ట్‌ : బాడీ కెమెరాలు ఉపయోగించి నూతన మోడల్‌ పోలీసు స్టేషన్‌లలో అవినీతి రహితంగా ఫిర్యాదు దారుల సమస్యలు పరిష్కరిస్తామని డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం నూతన మోడల్‌ పోలీసు స్టేషన్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నగరంపాలెం మోడల్‌ పోలీసు స్టేషన్‌లో  విలేకర్లతో మాట్లాడుతూ భారత దేశంలోనే ఆదర్శవంతమైన పోలీసు స్టేషన్‌లుగా వీటిని తీర్చిదిద్దుతామన్నారు. వీటి నిర్మాణానికి ఎంతో రిస్క్‌ తీసుకున్నామని చెప్పారు. నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు 20, పాత గుంటూరు పోలీసు స్టేషన్‌కు 20 బాడీ కెమెరాలు కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్‌లలో వినియోగించేందుకు   2వేలకు గాను 500 బాడీ కెమెరాలు అందాయన్నారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదు, తీసుకునే అధికారి మధ్య ఎటువంటి లోపాయికారి వ్యవహారం లేకుండా ప్రతి అంశం కెమెరాల్లో రికార్డు అవుతుందన్నారు. ఈ మోడల్‌పోలీసు స్టేషన్‌లలో పనిచేసే అధికారులు, సిబ్బంది  వాచకం, ఆహార్యం రీత్యా ఆదర్శవంతంగా మంచి వాతావరణాన్ని కలుగచేస్తారన్నారు. ఈ స్టేషన్‌లతో స్మార్టు పోలీసింగ్‌కు శ్రీకారం చుడతామని వివరించారు. 6వ తేదీ రెండు పోలీసు స్టేషన్‌ల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, రూరల్, అర్బన్‌ ఎస్పీలు నారాయణనాయక్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితర అధికారులున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు