అవినీతిపరులకు బయోందోళనే

20 Dec, 2016 23:01 IST|Sakshi
అవినీతిపరులకు బయోందోళనే
  • మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలకు చెక్‌
  • పాఠశాలల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌
  • జిల్లాలో తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు
  • జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
  • అనంతపురం ఎడ్యుకేషన్‌ :

    ఓ పాఠశాలలో 120 మంది విద్యార్థులుంటే వారిలో 30 మంది పాఠశాలకు హాజరుకాలేదు. కానీ మధ్యాహ్న భోజనం అటెండెన్స్‌ రిజిష్టర్‌లో మాత్రం అందరూ వచ్చినట్లు నమోదు చేశారు. గైర్హాజరు పిల్లలకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని సదరు ఏజెన్సీ, హెచ్‌ఎం ఇద్దరూ స్వాహా చేశారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే..ఇలాంటి పరిస్థితి చాలా స్కూళ్లలో ఉంది. చాలా రోజులుగా ఈ అక్ర మాల తంతు జరుగుతోంది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. పాఠశాలల్లో బోగస్‌ అటెండెన్స్‌కు చెక్‌ పెట్టేందుకు, అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం  బయో మెట్రిక్‌ పద్ధతిని ప్రవేశపెట్టనుంది. తద్వారా ఎంత మంది మధ్యాహ్న భోజనం తిన్నారో.. అంత మందికి మాత్రమే బిల్లు మంజూరవుతుంది.

              జిల్లాలో 3783 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆయా స్కూళ్లలో 3,43,557 మంది విద్యార్థులు భోజనం తింటున్నారు. టీచర్లు, విద్యార్థుల అటెండెన్స్‌ బయోమెట్రిక్‌ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముందుగా మధ్యాహ్న భోజన పథకం అమలులో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అమలుకు పూనుకున్నారు. 

    వేలిముద్ర పడితేనే బిల్లు :

    విద్యార్థి వేలిముద్ర పడితేనే ఏజెన్సీకి బిల్లు మంజూరవుతుంది. బయో అటెండెన్స్‌ ఆధారంగానే ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో బిల్లు జనరేట్‌ అవుతుంది. నెలలో ఏ విద్యార్థి ఎన్ని రోజులు మధ్యాహ్నం భోజనం చేశాడో క్రోడీకరించి, బిల్లు పంపుతారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు ఓసారి, మధ్యాహ్నం భోజన సమయంలో మరోసారి అటెండెన్స్‌ తీసుకుంటారు. ఎందుకంటే ఉదయం ఆలస్యమైనా కొందరు విద్యార్థులు భోజన సమయానికి వస్తారు. ఉదయం వచ్చీ మధ్యాహ్న భోజనానికి హాజరుకాని విద్యార్థులూ ఉంటారు. దీంతో రెండు పూటలా అటెండెన్స్‌ తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌ అంటెండెన్స్‌ తీసుకోదు. తర్వాత నమోదు చేసినా లాభం ఉండదు. ఎంతసేపూ గడువులోపు  నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న స్కూళ్లకు సమయం కాస్త ఎక్కువగా కేటాయిస్తారు. నిన్నటి రోజు కొందరి పిల్లలు నమోదు చేయలేదు.. ఈరోజు చేస్తామంటే కుదరదు. ఏరోజుకారోజు అటెండెన్స్‌ వేయాలి.

    తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు :

    జిల్లాలోని 3,783 స్కూళ్లకు గాను తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్‌ స్కూళ్లు ఉంటాయి. జాబితాను ప్రభుత్వం జిల్లా విద్యాశాఖకు పంపింది. అనంతపురం డివిజన్‌లో 268 పాఠశాలలు,  ధర్మవరం డివిజన్‌లో 428, గుత్తి డివిజన్‌లో 447, పెనుకొండ డివిజన్‌లో 365 స్కూళ్లలో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా స్కూళ్లలో బయోమెట్రిక్‌ మిషన్లు, సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ చేసేందుకు, ఏజెన్సీ నిర్వాహకులు, హెచ్‌ఎంలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేనాటికి ఈ ప్రక్రియ పూర్తయి అమలు చేసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

    వేలిముద్రలు నమోదు చేస్తున్నాం : శామ్యూల్, డీఈఓ

    బయోమెట్రిక్‌ అమలు నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నాం. మీసేవ, ఆన్‌లైన్‌ కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్లి వేలిముద్రలు నమోదు చేయిస్తున్నాం. జిల్లాలో తొలివిడతగా 1,505 స్కూళ్లలో అమలు కానుంది. ముందుగా ఆయా స్కూళ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే తర్వాత చెప్తాం.

     

మరిన్ని వార్తలు