అవినీతి మేట

30 Aug, 2016 22:56 IST|Sakshi
అవినీతి మేట

– ఫారంపాండ్ల తవ్వకంలో ఇష్టారాజ్యం
– తమ్ముళ్ల ‘ఉపాధి’కే పెద్దపీట
– అధికారుల అండతో యథేచ్ఛగా నిధుల దోపిడీ
– జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ.152 కోట్ల ఖర్చు   
 

‘పంట సంజీవని’ పేరుతో చేపట్టిన సేద్యపు కుంటలు (ఫారంపాండ్స్‌) అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారాయి. ఎక్కడికక్కడ నిధులు దోపిడీ చేయడమే లక్ష్యంగా వీటి తవ్వకాలు సాగుతున్నాయి. యంత్రాలతో కుంటలు తీయడమే కాకుండా అనువుగాని చోట పనులు చేపట్టి లక్ష్యానికి తూట్లు పొడుతున్నారు. ‘పచ్చ’ నేతలకు అధికారులు తోడు కావడంతో నిధుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

అనంతపురం: వర్షపు నీటిని ఒడిసిపట్టడంతో పాటు భూగర్భజలాలను పెంచే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం కింద  ‘పంట సంజీవని’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో 1,10,008 ఫారంపాండ్లు తవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు రూ.968 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. గత ఏడాది డిసెంబర్‌లో మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని మరూరులో ‘పంట సంజీవని’ ప్రారంభించారు. అయితే.. ఫారంపాండ్లు ఆశించిన లక్ష్యానికి చేరుకోలేకపోగా.. అక్రమాలకు కేరాఫ్‌గా మారాయి. ఇప్పటికి 11,132 మాత్రమే పూర్తి చేశారు. దాదాపు 52 వేల ఫారంపాండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి కోసం ఇప్పటికే రూ.152 కోట్లు వెచ్చించారు. కార్యక్రమం ప్రారంభం రోజు 20 వేల ఫారంపాండ్ల తవ్వకాన్ని ప్రారంభించినా అవి ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం.  

మంత్రి ఇలాకాల్లో తమ్ముళ్లకు ‘ఉపాధి’
మంత్రి సునీత సొంత నియోజకవర్గంలోని రాప్తాడు మండలం బండమీదపల్లి, గొందిరెడ్డిపల్లి, భోగినేపల్లి, కనగానపల్లి మండలం తూంచర్ల, పాతపాళ్యం, కొత్తూరు, కొండపల్లి, కేఎన్‌ పాళ్యం, ఆత్మకూరు మండలం వేప చెర్ల, రంగంపేట, రామగిరి మండలం ఎంసీపల్లి, రామగిరి, కుంటిమద్ది, కొండాపురం గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేయించారు.

ఈ అక్రమాలను గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఉపాధి హామీ అడిషనల్‌ పీడీ రాజేంద్రప్రసాద్‌ నిర్మాణాలను పరిశీలించారు. నివేదికను మాత్రం అటకెక్కించారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ, ఆత్మకూరు, పీ.యాలేరు, సనప, తలుపూరు, చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల, ప్యాదిండి, న్యామద్దెలలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గంలోని పుట్టపర్తి మండలం దిగువచెర్లోపల్లి, బడేనాయక్‌ తండా, పుట్టపర్తి, వెంగళమ్మచెరువు గ్రామాల్లో ఓ ప్రజాప్రతినిధి ఆదేశాలతో అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.  బుక్కపట్నం మండలంలోని బుక్కపట్నం, క్రిష్ణాపురం, సిద్దరాంపురం, ఓడీ చెరువు మండలంలోని తంగేడుకుంట, వెంకటాపురంలోనూ ఇదే పరిస్థితి.

అక్కడ ఆయనదే పెత్తనం
శింగనమల నియోజకవర్గంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి సోదరుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సేద్యపుకుంటలను తన అనుచరులకు ఆదాయవనరుగా మార్చారు.  బుక్కరాయసముద్రం మండలంలోని చియ్యేడు, రెడ్డిపల్లి, సిద్దరాంపురం, గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్‌ఎస్, కోటంక, పెనకచెర్లలో అక్రమాలు తారస్థాయికి చేరాయి. ఒక్క కోటంకలోనే 30–35 ఫారంపాండ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు  తెలుస్తోంది. పుట్లూరు, శింగనమల మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

‘అన్న’ల మాటే వేదం
ధర్మవరం మండలంలోని సీసీ కొత్తకోట, చింతలపల్లి, ధర్మపురి, గొట్లూరు, మల్లాకాల్వ, రావులచెర్వు, తుమ్మల తదితర పంచాయతీల్లో టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు నిధులు మింగేశారు. ముదిగుబ్బ మండలం దొరిగల్లు, మంగళమడక, ముదిగుబ్బలోనూ ఇదే పరిస్థితి. ఉరవకొండ నియోజకవర్గంలో  ‘అన్న’ పెత్తనం ఎక్కువైంది. ఈ మండలంలోని మోపిడి, చిన్నముష్టూరు, పెద్దకౌకుంట్ల, వెలిగొండతో పాటు వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో యంత్రాల సాయంతో పనులు చేసినట్లు తెలిసింది.

బిల్లుల కోసం ఒత్తిడి
కదిరి, పెనుకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఫారంపాండ్ల తవ్వకం చేపట్టారు. చాలాచోట్ల యంత్రాలతో పనులు చేయించి బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పెనుకొండ మండలం మునిమడుగు, మావటూరు, శెట్టిపల్లి, వెంకటగిరిపాళ్యంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అండతో ఆయన అనుచరులు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అధికారులు కూడా కమీషన్లకు తలొగ్గి సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కూలీలు పనులకు వెళ్లకున్నా బంధువుల పేర్లను మస్టర్లలో నమోదు చేసుకుని బిల్లులు పొందారు. ఇసుక నేలల్లో కుంటలను తవ్వకూడదన్న నిబంధనను ఎక్కడా పట్టించుకోలేదు.

>
మరిన్ని వార్తలు