పర్సెంటేజీల రాజ్‌

27 Mar, 2017 00:13 IST|Sakshi
పర్సెంటేజీల రాజ్‌

- రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు
– ఏడాదిన్నరకు రెండు సార్లు ప్యాచ్‌ వర్కులు
– రూ.81 లక్షలకు మరో రూ.8 లక్షలు అదనపు ఖర్చు
– పర్యావేక్షణ లోపంతో బరితెగిస్తున్న సిబ్బంది


అనంతపురం సిటీ : పంచాయతీరాజ్‌ శాఖ... అవినీతికి కేరాఫ్‌గా మారుతోంది. ఇక్కడి అధికారులకు చేయి తడిపితే చాలు... ఆ పనులు నాణ్యతగా ఉన్నాయా..? లేదా? అన్నది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమ వాటా తమకు అందిందా.. లేదా.. అన్నదే వారికి ముఖ్యం. ఇలాంటి అధికారుల అండ చూసుకునే కొందరు కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణ పనుల్లో వారిష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రోడ్లు వేసిన కొద్ది రోజులకే శిథిలావస్థకు చేరుతున్నా ప్యాచ్‌ వర్క్‌లతో సర్దుబాటు చేసేసి మమా అనిపించేస్తున్నారు.

పుట్లూరు పరిధిలోని తక్కాలపల్లి నుంచి పోతిరెడ్డిపల్లి దాకా పంచాయతీరాజ్‌ అధికారులు ఏడాదిన్నర క్రితం రోడ్డు. ఆర్‌.డీ.ఎఫ్‌ స్కీమ్‌ కింద రూ.81 లక్షల వ్యయంతో 3 కిలో మీటర్ల వేసిన రహదారి. నిర్మాణం పూర్తయిన 8 నెలలకే రోడ్డు గుంతలు పడడంతో అధికారులు ప్యాచ్‌ వర్కులు చేయించారు. రెండోసారి కూడా రహదారిపై గుంతలు పడటంతో గ్రామస్తులంతా అధికారుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ గుంతలను కప్పేందుకు అధికారులు మరో రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఏడాదిన్నర కాలంలో ఈ రహదారి రెండుసార్లు గుంతలు పడిందంటే క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీలు ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బందికి కూడా ఒక శాతం వాటా ముట్టచెబితే రిపోర్టు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా రాసేస్తారని పలువురు చోటా కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కొత్త నిర్మాణాలకు రూ.10 కోట్ల నిధులు ఇచ్చేందుకు ప్రణాళికలు పంపాలని ప్రభుత్వ పెద్దలు అధికారులకు చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది.

పర్యవేక్షణ లేకే...
 జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పనుల్లో నిధులను అనవసరంగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో అవసరం లేక పోయినా కల్వర్టులు నిర్మించి ఈ శాఖాధికారులు విమర్శలు మూటగట్టుకున్నారు. కేవలం జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ శాఖలో ఎవరికి వారు వాటాలతో జేబులు నింపుకుంటున్నట్లు స్పష్టమౌతోంది. ఇలాగే అధికారులు వాటాల కోసం చేతులు చాస్తే పనుల్లో నాణ్యత లోపించి...ప్రజల ప్రాణాలకే  ప్రమాదం పొంచి ఉందని జిల్లా వాసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో జరుగుతున్న రోడ్డు నిర్మాణాలపై దృష్టిసారించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు