వసూళ్ల రాణి

29 Apr, 2017 00:01 IST|Sakshi
వసూళ్ల రాణి
- ఇండెంట్ల ‘పంచాయతీ’
- డీపీఓ కార్యాలయంలో వసూల్‌ రాణి
- హడలెత్తిపోతోన్న కార్యదర్శులు, గుమస్తాలు
- పట్టించుకోని అధికారులు
- కొత్త కలెక్టర్‌ సారూ... దృష్టి సారించండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వెయ్యికి పైనే గ్రామ పంచాయతీలను పర్యవేక్షించే కార్యాలయం అది. ఏడాది కాలంగా ఆ కార్యాలయం ఇన్‌ఛార్జీల పాలనలో నడుస్తోంది. ఎన్ని కార్యాలయాలకైనా అధికారులను నియమిస్తున్నారు గానీ ఆ కార్యాలయానికి మాత్రం శాశ్వత ప్రాతిపదికన అధికారిని నియమించే సాహసం చేయడం లేదు. ఏజెన్సీలో పనిచేయాల్సిన అధికారి టీవీఎస్‌జీ కుమార్‌ను ఇన్‌ఛార్జి డీపీఓగా గత జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ నియమించారు. అనంతరం ఆ కార్యాలయంలో దిగువ స్థాయిలో పెత్తనం మితిమీరిపోయింది. అలా అని ఆ కార్యాయంలో పనిచేసే అందరినీ ఒకే గాటన కట్టలేం. తానే అంతానంటూ పెత్తనం చెలాయిస్తున్న ఒక అధికారిణితోనే చిక్కంతా వచ్చిపడిందని సహచర ఉద్యోగులు మదనపడుతున్నారు. అందుకే ఆ సీటు వద్దకు వెళ్లాలంటే గ్రామ పంచాయతీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అలా అని వెళ్లకుండా ఉండనూ లేరు. ఎందుకంటే ఆ సీటు విలువ అటువంటిది మరి. పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు, శానిటేషన్‌ బడ్జెట్, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ వర్కర్ల రెన్యువల్‌ వంటి ఫైళ్లు ఇలా అన్నీ ఆ అధికారిణి చేతుల మీదుగానే క్లియర్‌ కావాలి. దీంతో సంబంధిత ఫైళ్లు పట్టుకుని ఆమె దగ్గరకు వెళ్లడమా లేదా అనే మీమాంసలో పంచాయతీ కార్యదర్శులు, గుమస్తాలు కొట్టుమిట్టాడుతున్నారు.
లంచం టార్గెట్లు నిర్దేశిస్తూ...
 గడచిన నెల రోజులుగా అపరిమితమైన అధికారాలతో ఆమె వసూల్‌ రాణి అవతారమెత్తడంతో కార్యాలయ ఉద్యోగులు ఎవరికీ చెప్పుకోలేకున్నారు. ఆ అధికారిణి వద్దకు ఫైళ్లు తీసుకు వెళ్లే పంచాయతీ ఉద్యోగులకు టార్గెట్లను నిర్వేశించమే అసలు సమస్య. అది కూడా తన బంధువు పేరుతో నిర్మిస్తున్న ఇంటికి మెటీరియల్‌ సరఫరా చేయాలని ఇస్తున్న మౌఖిక ఆదేశాలు కార్యాలయంలో సహచర ఉద్యోగులకు మింగుడు పడడం లేదు. అలా అని బయటపడి ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తన వద్దకు ఫైళ్లతో వచ్చే పంచాయతీ కార్యాదర్శులు, గుమస్తాలకు తలో పాతిక, రూ.50 వేలు, రూ.లక్ష ఇలా ఇండెంట్‌ వేస్తున్నారు. గడచిన నెల రోజులుగా ఈ తతంగమంతా డీపీఓ కార్యాలయం కేంద్రంగానే నడుస్తోంది. ఆ ఇంటి నిర్మాణానికి వసూల్‌ రాణి లక్ష్యంగా రూ.20 లక్షలు పెట్టుకుని దందా ప్రారంభించారని ఆ కార్యాలయంలో సిబ్బంది కోడై కూస్తున్నారు.
మేజర్‌ పంచాయతీలపై దృష్టి..
ఆదాయంలేని చిన్నా, చితకా గ్రామ పంచాయతీలపై మాత్రం కాస్తా దయతలిచి విడిచిపెట్టేశారు. జిల్లా వ్యాప్తంగా 1069 గ్రామ పంచాయతీలుండగా, నోటిఫైడ్‌ పంచాయతీలు 240 వరకూ ఉన్నాయి. ప్రధానంగా ఈ 240 గ్రామ పంచాయతీలే లక్ష్యంగా గడచిన నెల రోజులుగా వసూళ్ల పర్వం నడుస్తోంది. ఇంటి నిర్మాణానికి ఇనుము, ఇసుక, ఇటుక...ఇలా మెటీరియల్‌ పలు నోటిఫైడ్‌ గ్రామ పంచాయతీల కార్యదర్శులపై ‘భారం’ వేసినట్టు జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. కోనసీమ ముఖద్వారంలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శికి రూ.50 వేలు ఇండెంట్‌ వేస్తే అంత ఇచ్చుకోలేమని రూ.20వేలు అని నాన్చడంతో  ఆ కార్యదర్శిపై విరుచుకుపడ్డారని తెలిసింది. లేదంటే నాలుగు లారీల ఇసుక పంపించాలని హుకుం జారీ చేశారని సమాచారం. అదే సీమలో మరో నోటిఫైడ్‌ పంచాయతీకి రూ.30 వేలు, కాకినాడ రూరల్‌ మండలంలో ఉన్న ఒక మేజర్‌ పంచాయతీకి రూ.75 వేలు వాటాగా వేశారంటున్నారు. వీరిలో ఇద్దరు కార్యదర్శులు రూ.20 వేలు మించి ఇవ్వలేమని చేతులెత్తేయడంతో కొన్నాళ్లు ఫైళ్లు తొక్కిపెట్టేసి చివరకు తిప్పి పంపేశారని తెలిసింది.
నెల రోజులుగా ఇదే తంతు...
నెల రోజులుగా నడుస్తున్న ఈ బాగోతంతో బెంబేలెత్తిపోయిన కార్యదర్శులు కాకినాడ రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. లేదంటే తమ కింద పనిచేసే గుమస్తాలను పంపిస్తున్నారు.ఆ క్రమంలో గుమస్తాలు తీసుకువచ్చిన ఫైళ్లు పక్కనబెట్టేసి  కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ఎన్‌ఎమ్‌ఆర్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నాలుగు వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి జీతాలు విడుదల డీపీఓ కార్యాలయం దయతలచాల్సిందే. వీరి  వేతనాల బిల్లులు, శానిటేషన్‌ బిల్లులను డీపీఓ కార్యాలయం నుంచే మంజూరు చేయాలి. శాశ్వత డీపీఓ లేకపోవడంతో చక్రం తిప్పే అవకాశం ఆయాచితంగా లభించడంతో  ఎంతకైనా ఈమె బరితెగిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పలు ఆరోపణలపై సస్పెన్షన్‌ వేటు కూడా ఆమెపై పడింది.
‘ఫిర్యాదు రాలేదు..వస్తే చర్యలు తప్పవు’
కార్యాలయంలో ఇలా వసూళ్ల దందా నడుస్తున్నట్టు ఇంతవరకు నా దృష్టికి రాలేదు. వసూళ్ల టార్గెట్ల వ్యవహారం మీరు చెబితేనే వింటున్నా. ఫిర్యాదులేమైనా వస్తే విచారించి చర్యలు తీసుకుంటాం.
టీవీఎస్‌జి కుమార్, ఇన్‌చార్జి డీపీఒ.కాకినాడ
మరిన్ని వార్తలు