అక్రమాల ‘వెలుగు’

21 Sep, 2016 22:44 IST|Sakshi
అక్రమాల ‘వెలుగు’

►  ఎక్కడికక్కడ నిధులు స్వాహా
►  విచారణ పేరుతో నామమాత్రపు చర్యలు
►  రికవరీ చేయకుండానే ‘బేరం’పెట్టి పోస్టింగ్‌
►  కొత్త స్థానంలోనూ మారని అక్రమార్కుల పంథా


అనంతపురం టౌన్‌ : ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’.. ఈ ఫార్ములాని అక్షరాలా పాటిస్తున్నారు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ–వెలుగు అధికారులు. మహిళా సంఘాల సొమ్మును కింది స్థాయి ఉద్యోగులు అప్పనంగా దిగమింగుతుంటే ఉన్నతాధికారులు ‘చేతివాటం’ ప్రదర్శించి వత్తాసు పలుకుతున్నారు. ఈ క్రమంలో స్వాహా చేసిన సొమ్ము పూర్తిస్థాయిలో రికవరీ కాకపోగా రాజకీయ అండతో మళ్లీ విధుల్లో చేరుతున్న అవినీతిపరులు తమ దోపిడీనే యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కమ్యూనిటీ కో ఆర్డినేటర్ల (సీసీ)ల అవినీతికి అడ్డే లేకుండాపోతోంది. ఈ సమయంలో డీఆర్‌డీఏలోని ఓ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులకు మళ్లీ పోస్టింగ్‌ ఇవ్వడం కోసం ‘బేరాలు’ పెడుతున్నట్లు సమాచారం.

అక్రమార్కులకే అందలం :
ఏ శాఖలోనైనా ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొత్తచెరువు మండలం లోచర్ల పంచాయతీ పరిధిలో వెలుగు సీసీ రామాంజులు 278 మంది పింఛన్‌దారుల నుంచి రూ.100 చొప్పున రూ.27,800 వసూలు చేశారు. విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్‌ చేశారు. ఇతను బుక్కపట్నం మండలంలో పని చేసే సమయంలో బినామీ పేర్లతో గ్రామైక్య సంఘం ఏర్పాటు చేసి రూ.23 లక్షలు స్వాహా చేసిన వైనం అప్పట్లో విచారణలో కూడా తేలింది. అయినా కఠిన చర్యలు తీసుకోని అధికారులు నెల రోజులకే రొద్దం మండలానికి పోస్టింగ్‌ ఇచ్చారు.

అక్కడి నుంచి నెల రోజుల్లోనే మళ్లీ కొత్తచెరువుకు బదిలీ చేయించుకున్న అతను పింఛన్ల సొమ్మును దిగమింగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. కూడేరులో స్త్రీ నిధి రుణాల మంజూరులో చేతివాటం ప్రదర్శించినట్లు ఫిర్యాదులు రావడంతో సీసీ నారాయణస్వామిపై విచారణ చేసి సస్పెండ్‌ చేశారు. ఈయన బుక్కరాయసముద్రంలో పని చేస్తుండగా అవినీతికి పాల్పడ్డాడని సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కనగానపల్లి మండలానికి పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే అక్కడా ఇమడలేక ముడుపులు ఇచ్చుకుని కూడేరుకు వేయించుకున్నాడు. తాజాగా ఇక్కడ కూడా నిధులు స్వాహా చేయడంతో సస్పెండ్‌ చేయగా మళ్లీ పోస్టింగ్‌ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. డీఆర్‌డీఏ కార్యాలయంలోని ఓ అధికారి సాయంతో ఇప్పటికే పోస్టింగ్‌ ఆర్డర్‌ కూడా సిద్ధం చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే మండలం జయపురం గ్రామంలో స్త్రీ నిధి డబ్బులు కాజేశారని ఓ సీసీపై పీడీకి ఫిర్యాదు అందింది. మూడేళ్ల క్రితం రూ.30 వేలు తీసుకుని అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై డీపీఎంలు నరసయ్య, రవీంద్రబాబు విచారణ చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఇదే మండలంలో సీసీగా పని చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బ్రహ్మసముద్రం మండలంలో పని చేస్తున్నాడు. అప్పట్లో మహిళా సంఘానికి వచ్చిన రుణాలను సంఘం ఖాతాలోకి వేయకుండా సభ్యుల ఖాతాలోకి వేయడంలో సదరు సీసీ కీలకపాత్ర వహించాడు. ఈ క్రమంలో నిధులు స్వాహా చేశాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చినా రికవరీ మాత్రం చేయలేదు. ఇటీవల జరిగిన మండల సమాఖ్య సమావేశంలో సభ్యులు ‘రికవరీ’ విషయాన్ని ప్రస్తావించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు.

ఇక తాడిమర్రి మండలంలోని ఓ సీసీ బ్యాంక్‌ లింకేజ్‌కు సంబంధించి నిధులు స్వాహా చేశాడు. అయినా కఠిన చర్యల్లేవ్‌. పెనుకొండ మండలం గుట్లూరుకు చెందిన సీసీ అనిత రూ.40 లక్షల వరకు స్వాహా చేశారని తేలడంతో సస్పెండ్‌కు గురయ్యారు. అయితే రికవరీ మాత్రం నామమాత్రంగానే ఉంది. వీరు మాత్రమే కాదు.. ఉరవకొండ, కళ్యాణదుర్గం, శెట్టూరు, ధర్మవరం, వజ్రకరూరు, బుక్కరాయసముద్రం, గుత్తి, బుక్కపట్నం మండలాల్లో స్త్రీనిధికి సంబంధించి మోసాలు అనేకం ‘వెలుగు’లోకి వచ్చినా విచారణ పేరుతో పక్కదారి పట్టించారే గానీ కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం సస్సెన్షన్‌లో ఉన్న సిబ్బంది ఎలాగైనా పోస్టింగ్‌లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తుండగా మరికొందరు ‘ముడుపులు’  అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీఆర్‌డీఏ, ఏపీఎంఐపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం
ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. కొందరు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ చేశాం. కొందరిని వారి పనితీరు ఆధారంగా దూరప్రాంతాలకు బదిలీ చేశాం. డబ్బులు స్వాహా చేస్తున్న వారి విషయంలో రాజీ పడేది లేదు.
– వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ–వెలుగు పీడీ

మరిన్ని వార్తలు