మిర్చి రైతు కంటతడి

27 Apr, 2017 23:41 IST|Sakshi
మిర్చి రైతు కంటతడి

- జిల్లాలో మూడింతలు పెరిగిన మిరప విస్తీర్ణం
- ధర భారీగా పతనం, పెట్టుబడి కూడా రాని వైనం
- గుంటూరు యార్డుకు వెళ్లేందుకు సవాలక్ష షరతులు
- లబోదిబోమంటున్న రైతులు

 
అనంతపురం అగ్రికల్చర్‌ : గిట్టుబాటు ధర లేక కుదేలైన అరటి, మామిడి, చీనీ రైతుల మాదిరిగానే ఇప్పుడు మిరప రైతులు కూడా కంటతడి పెడుతున్నారు. జిల్లాలలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం 2,500 హెక్టార్లు కాగా.. గతేడాది మంచి ధరలు పలకడంతో రైతులు ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పంట వేశారు. ఒక ఎకరా వేసే రైతులు రెండు, మూడు ఎకరాలు సాగు చేశారు. దీంతో విస్తీర్ణం మూడింతలు పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,700 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగైంది. గుంతకల్లు, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, రాయదుర్గం, కణేకల్లు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుత్తి, పామిడి తదితర మండలాల్లో ఎక్కువగా పంట వేశారు.

భారీగా పెట్టుబడి
 జిల్లాలో బ్యాడిగ, బ్యాడిగ కడ్డీ, బ్యాడిగ డబ్బీ, 232, 273, ఎల్‌సీఏ 334, తేజ్‌ లాంటి మిరప రకాలు సాగు చేశారు. ఇది తొమ్మిది నెలల పంట. ఎకరాకు రూ.75 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ సారి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నందున గతేడాది మాదిరి ధరలు పలికితే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశించారు. దిగుబడుల పరంగా ఆశాజనకంగా వచ్చినా ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. పెట్టిన పెట్టుబడులు పరిగణనలోకి తీసుకుంటే క్వింటాల్‌ ఎండుమిర్చి రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికితే నష్టం ఉండదు. కానీ.. ప్రస్తుతం మార్కెట్‌లో  రూ.5 వేలకు కాస్త అటూఇటు పలుకుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

గుంటూరులో అమ్ముకునేందుకు అష్టకష్టాలు
 జిల్లాతో పాటు బళ్లారి మార్కెట్‌లో కూడా మిర్చి ధరలు పతనమయ్యాయి.  కొనేవారు కరువయ్యారు. ఎండుమిర్చికి కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్‌ ప్రైసెస్‌–ఎంఎస్‌పీ) విధానం కూడా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డులో క్వింటాల్‌ రూ.8 వేల కన్నా తక్కువకు అమ్ముడుపోయిన రైతులకు క్వింటాల్‌పై రూ.1,500 చొప్పున ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో జిల్లా రైతులు అక్కడికి వెళుతున్నారు. అనంతపురం నుంచి గుంటూరుకు సరుకు తీసుకెళ్లాలంటే క్వింటాల్‌పై రూ.200 వరకు రవాణా భారం పడుతుంది. అక్కడికి తీసుకెళ్లిన వెంటనే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట సాగు చేసినట్లు వ్యవసాయ లేదా ఉద్యానశాఖ అధికారుల ద్వారా అన్ని వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి. గుంటూరు యార్డులో అమ్ముతున్నట్లు అక్కడి నుంచి మరో ధ్రువీకరణ పత్రం తెప్పించుకుని.. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాతే సరుకును లోపలికి అనుమతిస్తారు.

ధ్రువీకరణ పత్రం  పంట పొలాలు పరిశీలిస్తే కానీ ఇవ్వలేమని అధికారులు మెలిక పెడుతుండటంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. అలాగే అమ్మిన 20 రోజులకు కాని బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాదంటున్నారు. రూ.8 వేలు పలికినా పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. పురుగుమందులు, ఎరువుల అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇన్ని కష్టాలు పడాలా అంటూ నిట్టూరుస్తున్నారు. మిరప రైతుల కష్టాలను జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

మార్కెట్‌ సదుపాయం నిల్‌
 మిరప పంట విస్తీర్ణం ఇటీవల పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైనా మార్కెట్‌ సదుపాయం కల్పించకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి కోల్డ్‌స్టోరేజీలు, మౌలిక సదుపాయాలు లేవు. కోల్ట్‌స్టోరేజీలను ఏర్పాటు చేయడంతో పాటు రైతుబంధు పథకం వర్తింపజేస్తే మార్కెట్‌లో గిట్టుబాటు ధర వచ్చిన సమయంలో అమ్ముకునేందుకు వెసులుబాటు కలుగుతుంది.

మరిన్ని వార్తలు