‘పత్తి’ రైతు ఆత్మహత్య

19 Sep, 2017 12:37 IST|Sakshi
మల్లాజి కుమారులు, తండ్రి

పురుగుల మందు తాగి బలవన్మరణం
అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులే కారణం


ఐనవోలు(వర్ధన్నపేట) :
పత్తి పంట కాటుకు ఓ యువ రైతు బలయ్యాడు. పెట్టుబడికి చేసిన అప్పులు తేర్చే మార్గం కనిపించక తనవాళ్లనొదిలి తనదారిన తాను వెళ్లిపోయాడు. భార్యాపిల్లల్ని కన్నీళ్లసంద్రంలోకి నెట్టివేశాడు. ఈ హృదయ విదారక ఘటన ముల్కలగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఐనవోలు ఎస్సై కె.అశోక్‌కుమార్‌ కథనం ప్రకారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలంలోని ముల్కలగూడెం గ్రామానికి చెందిన యువ రైతు గుండెకారి మల్లాజి(33) ఆదివారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మల్లాజి భార్య పద్మకు సమాచారం అందించారు. ఆమె బంధువులు, గ్రామస్తుల సాయంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించే ప్రయత్నం చేస్తుండగానే అతడు మరణించాడు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌కుమార్‌ తెలి పారు.

ఆర్థిక ఇబ్బందులే..
మల్లాజికి మూడెకరాల భూమి ఉంది. అందులో పత్తి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. కాలం కలిసి రాక, పంట సరిగా చేతికి రాక మూడేళ్లుగా వ్యవసాయంలో నష్టాలను చవిచూశాడు. తెలిసిన వాళ్ల దగ్గర ఐదు లక్షల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు. అప్పులు తేర్చేందుకు గత సంవత్సరం గ్రామంలో ఓ రైతు వద్ద పాలేరుగా పనికి చేశాడు. మళ్లీ ఈ ఏడాది వ్యవసాయంపై నమ్మకం ఉంచి ఎలాగైనా అప్పులు తీర్చాలన్న పట్టుదలతో తనకున్న మూడెకరాలతో పాటు పక్కనే ఉన్న మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. కానీ అధిక వర్షంతో పత్తి కాతా,పూత లేకుండా పోయింది. దాంతో పాటు తెగుళ్లు సోకాయి. తీవ్ర ఆందోళనకు గురైన మల్లాజి అప్పులు తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.  మల్లాజి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు