పోటెత్తిన పత్తి.. తగ్గిన ధర

25 Oct, 2016 04:02 IST|Sakshi
పోటెత్తిన పత్తి.. తగ్గిన ధర

 జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్‌లో తెల్లబంగారానికి ధర తగ్గడంతో రైతులు తెల్లబోయారు. వారం వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.400 ధర పడిపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. సోమవారం జమ్మికుంట మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు దాదాపు ఆరువేల బస్తాల్లో మూడు వేల క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చారు. అలాగే రెండు వందల పైగా వాహనాల్లో 2131 క్వింటాళ్లు లూజ్ పత్తి వచ్చింది. మొదట బస్తాల వద్ద మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్, వైస్‌చైర్మన్ రాజేశ్వర్‌రావు, కార్యదర్శి వెంకట్‌రెడ్డి సమక్షంలో వేలంపాట ప్రారంభించారు.
 
  నాణ్యమైన పత్తికి గరిష్ట ధర రూ.4960 పలుకడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. పత్తి ఎక్కువగా రావడంతో వ్యాపారులు, అడ్తిదారులు ధరలు తగ్గించి కొనుగోళ్లు చేపట్టారని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి రూ.5370 వరకు ధరలు పలికారుు. మున్ముందు ధరలు పెరుగుతాయని రైతులు ఆశించగా.. వారం రోజుల్లోనే అంతా తారుమారైంది. లూజ్ పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5వేలు, కనిష్టంగా రూ.4560 వరకు ధరలు చెల్లించారు. బస్తాల్లో వచ్చిన పత్తి క్వింటాల్ రూ.3800 నుంచి రూ.4200 వరకు కోనుగోలు చేశారు. వారం రోజుల్లోనే క్వింటాల్‌కు ఏకంగా రూ.400 వరకు తగ్గడంతో పత్తి అమ్మలా... వద్దా అని రైతులు సందిగ్ధంలో పడ్డారు.
 
 దీపావళి పండగ సమయంలో పత్తికి మంచి ధరలు పలుకుతున్నాయని సంతోషపడ్డ రైతులు ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు. పత్తి మార్కెట్‌లో సోమవారం నుంచి కచ్చితంగా ఈ-నామ్ కొనుగోళ్లు అమలు చేస్తామని ప్రకటించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ విషయూన్ని మరిచిపోయారు. ఆన్‌లైన్ కొనుగోళ్లపై అధికారులు ఊసెత్తకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఆన్‌లైన్ కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. వ్యాపారులు నేరుగా వేలంపాడటం కంటే ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ చేయడం పత్తికి ఎక్కువ ధర పలుకుతుందని, ఈ-నామ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయూలని రైతులు కోరారు.
 

మరిన్ని వార్తలు