విత్తు.. పత్తే!

15 Jun, 2016 01:19 IST|Sakshi
విత్తు.. పత్తే!

సాగుకే మొగ్గు మమకారాన్ని చంపుకోని రైతన్న
జోరుగా విత్తన కొనుగోళ్లు పెరుగుతున్న సాగు విస్తీర్ణం
పరోక్షంగా అడ్డుకుంటున్న అధికారులు
కో-మార్కెటింగ్ విధానంపై కొరడా
కనీసం యాభై శాతమైనా తగ్గిస్తామంటున్న అధికారులు

 రైతులు పత్తిని వదులుకోలేకపోతున్నారు. పత్తి సాగు చేయొద్దంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా.. అధికారులు వచ్చి నచ్చజెప్పినా రైతులు మాత్రం పత్తిపై ఉన్న మమకారాన్ని చంపుకోలేకపోతున్నారు. మద్దతు ధర రాదని, సాగు చేస్తే నష్టపోతారని చెబుతున్నా అక్కడక్కడా పత్తి సాగు చేస్తూనే ఉన్నారు. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. గత ఏడాది కంటే తక్కువే అయినా సాగును మాత్రం ఆపలేకపోతున్నారు అధికారులు. పరోక్షంగానైనా అడ్డుకునేందుకు అధికారులు బీటీ విత్తనాల విక్రయాలపై నిఘా పెట్టారు. ఏళ్ల తరబడి కొనసాగుతోన్న కో-మార్కెటింగ్ విధానంపై కొరడా ఝుళిపిస్తున్నారు. కనీసం 50 శాతం మేరకైనా పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తామని చెబుతున్నారు.

గజ్వేల్: జిల్లాలో ఏటా పత్తి పంటదే అగ్రస్థానం. ఏటా సుమారు 1.30 లక్షల హెక్టార్లలో సాగులోకి వస్తున్న ఈ పంట ప్రధాన పంట గా ఆవిర్భవించింది. కరువు పరిస్థితుల్లోనూ పెట్టుబడులు నష్టపోకుండా ఉంటామన్న భరోసాతో రైతులు ఏటా తెల్ల‘బంగారం’పై మమకారాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ సారి అంతర్జాతీయ  పత్తి మార్కెట్లో తలెత్తిన ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తికి గిట్టుబాటు ధర లభించే అవకాశం లేదు. మద్దతు ధర రావడం కూడా కష్టమేనని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా విసృ్తత ప్రచారాన్ని చేపడుతోన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విత్తనాల విక్రయాలపైనా  ప్రభుత్వం కన్నేసింది. విక్రయాలను కట్టడి చేయడం ద్వారా పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

కో-మార్కెటింగ్‌కు అడ్డుకట్ట...
పత్తి విత్తనాల విక్రయంలో ప్రధాన భూమిక పోషిస్తున్న కో-మార్కెటింగ్ విధానానికి ఈ సారి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. నిజానికి కో-మార్కెటింగ్ విధానానికి అనుమతులు లేవనే వాదనను తెరపైకి తెచ్చింది. పత్తి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్న పదికిపైగా ప్రధాన కంపెనీలతోపాటు మరో 42కుపైగా కంపెనీలు కో-మార్కెటింగ్ చేస్తున్నాయి. పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీలు విత్తనాలను టోకుగా కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్నాయి. కో-మార్కెటింగ్ పేరిట పెద్ద కంపెనీల విత్తనాలు అమ్మాల్సిన చిన్న కంపెనీలు... సొంత బ్రాండ్లను మార్కెట్‌లోకి తెచ్చి నకిలీ వ్యాపారానికి పాల్పడుతున్నాయనే అనుమానాన్ని వ్యవసాయశాఖ వ్యక్తం చేస్తోంది. ఈ దశలో కో-మార్కెటింగ్‌కు అనుమతిచ్చేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఈనెల 6న గజ్వేల్ నియోజకవర్గంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు విసృ్తతంగా తనిఖీలు చేపట్టి మూడు వేల విత్తన ప్యాకెట్లను సీజ్ చేసి, 15 మంది విత్తన డీలర్లకు నోటీసులిచ్చారు. సిద్దిపేట తదితర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

 క్రమంగా పెరుగుతోన్న విత్తనాల విక్రయాలు..
జిల్లాలో గతంతో పోలిస్తే బీటీ విత్తనాల అమ్మకాలు తగ్గాయి. కాగా రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు క్రమంగా బీటీ విత్తనాల కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. ఏటా జిల్లాకు 5 లక్షల పైచిలుకు విత్తన ప్యాకెట్ల కేటాయింపు జరిగితే... గతేడాది ఈ పాటికి 2.80 లక్షల ప్యాకెట్లు అమ్మడయ్యాయి. 2011, 2012, 2013లలో కొన్ని కంపెనీల విత్తనాలు భారీ ఎత్తున బ్లాక్ మార్కెట్ జరిగింది. కోట్లాది రూపాయల్లో ఈ వ్యాపారం జరిగేది. ఆ రకం విత్తనాల కోసం రైతులు ఎగబడితే పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కట్టించి పంపిణీ చేసేవారు. కానీ నేడు ప్రభుత్వం సాగును తగ్గించాలనే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో... ఈసారి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1.34 లక్షల ప్యాకెట్లు అమ్ముడయ్యాయని జేడీఏ మాధవీశ్రీలత ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తున్నా.... తెల్ల‘బంగారం’ అంటే మమకారం చావని కొందరు రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పత్తి మొలకెత్తింది.

మరిన్ని వార్తలు