నిధుల దుర్వినియోగంపై నిగ్గుతేల్చాలి

14 Oct, 2016 22:01 IST|Sakshi
నిధుల దుర్వినియోగంపై నిగ్గుతేల్చాలి
  • వైఎస్సార్‌ సీపీ సభ్యుల డిమాండ్‌ 
  • వాడీవేడీగా రాజమహేంద్రవరం కౌన్సిల్‌ సమావేశం
  • అధికార–ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం 
  • వైఎస్సార్‌ సీపీ సభ్యులకు అడుగడుగున అడ్డంకులు
  • ప్రజాధనం లూఠీపై షర్మిలారెడ్డి ఆగ్రహం
  •  
    రాజమహేంద్రవరం సిటీ/కోటగుమ్మం : 
    నగర పాలక సంస్థలో నిధుల దుర్వినియోగం వ్యవహారంపై నిగ్గుతేల్చాలని వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పాలక మండలి సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. కేవలం ఐదుగురు వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు సమస్యలను, నగరంలో చోటు చేసుకున్న అవకతవకలను ప్రస్తావిస్తూ... భారీ సంఖ్యలో ఉన్న అధికార పార్టీ సభ్యులకు ముచ్చెమటలు పట్టించారు. అధికార పార్టీ వారు చేసే వాదానికి ప్రతివాదం చేస్తూ మీకు మేమేమీ తీసిపోమంటూ వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, కార్పొరేటర్‌ బొంత శ్రీహరి ధ్వజమెత్తారు. 
     షర్మిలారెడ్డి మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న హోర్డింగ్‌ల సంఖ్యకు నగర పాలక సంస్థ అధికారులు ఇస్తున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. నగరంలో ఆర్‌కే యాడ్‌ ఏజెన్సీకి చెందిన హోర్డింగ్‌ల సంఖ్యకు చెల్లిస్తున్న ట్యాక్స్‌కు సంబంధం లేకుండా ఉందన్నారు. దీనివల్ల ప్రజాధనం లూఠీ అయిపోతోందని, తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నిర్భాగ్యుల కోసం ఏర్పాటు చేసిన నైట్‌ షల్టర్‌ ద్వారా జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కల్పించుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంలో షర్మిలారెడ్డి– అప్పారావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనిపై సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ కమిషనర్‌ను కోరారు. 
     
    గతంలో ఎందుకు సస్పెండ్‌ చేశారు?
    తమను గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో వివరణ ఇవ్వాలంటూ వైఎస్సార్‌ సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. పెరిగిన నగర విస్తీర్ణంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేడియం నిర్మాణం ఎక్కడ చేపట్టాలన్న విషయాన్ని మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. నగరపాలక సంస్థకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు పరిష్కరించేందుకు ఎంత మంది న్యాయవాదులు ఉన్నార ని ప్రశ్నించారు. న్యాయవాదులు లేకపోవడం వల్లే న్యాయస్థానాల్లో కేసులు మగ్గిపోతున్నాయన్నారు. మాస్టర్‌ప్లాన్‌ వ్యవహారంలో అందరితో చర్చించిన తరువాతే తీర్మానం ఆమోదించాలని సూచించారు. 16వ డివిజన్‌లో ఉన్న కబేళాను ఎక్కడికి తరలిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యుల సమస్యలు వివరించే సమయంలో అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలారు.
     
    మున్సిపల్‌ చట్టం అమలులో వ్యత్యాసమెందుకు?
    వారానికోసారి నిర్వహించాల్సిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదంటూ కార్పొరేటర్‌ బొంత శ్రీహరి ప్రశ్నించారు. మున్సిపల్‌ చట్టం అమల్లో హైదరాబాద్‌కు రాజమహేంద్రవరం మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. స్థానిక సమస్యలు తప్ప చట్టాల గురించి మాట్లాడేందుకు వీలు లేదంటూ అధికార పార్టీ సభ్యులు అడ్డు తగలడంతో కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మేయర్‌ కల్పించుకుని డివిజన్‌లో సమస్యలు చెప్పాలని, మిగిలిన విషయాలు అజెండా తరువాత చర్చిద్దామని చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రావాల్సిన పుష్కర నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కనీసం రూ.50 కోట్లైనా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 
     
    మహానగరం తీర్మానం వాయిదా 
    భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని 20 ఏళ్ల ముందుగా నగరాన్ని వివిధ కోణాల్లో అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మహానగరం మాస్టర్‌ ప్లాన్‌పై చర్చ వాయిదా పడింది. కార్పొరేటర్లకు, నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తరువాతే తీర్మానంపై ఆమోదిద్దామంటూ సభ్యులు సూచించారు. దీంతో మాస్టర్‌ ప్లాన్‌ వ్యవహారంపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ఈ నెల 21కి వాయిదా వేశారు.
     
    అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుకుందాం 
    మాస్టర్‌ ప్లాన్‌ను సమగ్రంగా చర్చించి ఆమోదింప చేసుకుని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విలీనమవుతున్న గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు వచ్చేందుకు కృషి చేయాలన్నారు. వాదాలు చేసుకోకుండా విజన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. 
     
    నిబంధనలకు విరుద్ధంగా...
    కౌన్సిల్‌ సమావేశంలోకి నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు యూనిఫాం ధరించి రావడం చర్చనీయాంశమైంది. యూనిఫాంతో రావడం నిషేధమైనప్పటికీ ట్రాఫిక్‌ డీఎస్పీ జి.శ్రీకాంత్, త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు యూనిఫాంతో కౌన్సిల్‌లో విజిటర్స్‌ విభాగంలో కూర్చున్నారు. దీన్ని గమనించిన కమిషనర్‌ విజ యరామరాజు సీసీతో కబురుపెట్టి యూనిఫాంతో సమావేశంలో ఉండరాదని చెప్పడంతో వారంతా బయటకు వెళ్లిపోయారు. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ విషయమై స మావేశంలో చర్చించేందుకు అజెండాలో పొందుపర్చడంతో సభ్యులకు వివరించేందుకు వారు వచ్చారు.
     
     
మరిన్ని వార్తలు