మండలి ప్రశ్నోత్తరాలు

8 Oct, 2015 03:10 IST|Sakshi
మండలి ప్రశ్నోత్తరాలు

నేను పాత గౌడ్‌ను.. ఆదాయం పెంచుతా

  ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు
 సాక్షి, హైదరాబాద్: ‘నేను పాతగౌడ్‌ను. పాతకాలంలో కల్లు గీసి తాగించడం తప్పతాగే అలవాటు మాకు లేదు. ఇప్పు డు మారిన పరిస్థితుల ప్రకారం మాలో(గౌడ్‌లలో) కొంద రు తాగుతున్నా, మా కుటుంబంలో ఎవరికీ ఆ అలవాటు కాలేదు. కల్లు తాగే అలవాటును వీలైనంత ఎక్కువమందికి నేర్పించి, వ్యాపారం పెంచుకోవడం మా వృత్తి ధర్మం’ అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో తనను కలసిన విలేకరులతో ఆయన సరదాగా మాట్లాడుతూ, ‘గీత కార్మికునిగా నాకు వారి సమస్యలు, కష్టనష్టాలు తెలుసు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచాల్సిన బాధ్యత నాపై ఉంది. ఏ రకంగా చూసినా వ్యాపారం పెంచాల్సిన బాధ్యత నాదే కదా’ అని వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయని జరుగుతున్న ప్రచారం గురించి అడిగితే, తనకేమీ తెలియదని, అంతా ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసునని సున్నితంగా తప్పించుకున్నారు.
 
రెండువేల కోట్లతో పల్లెల దాహార్తి తీర్చవచ్చు
 సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం రూ. 36 వేల కోట్లతో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కంటే రూ. 2 వేల కోట్లతో తెలంగాణాలోని పదివేల గ్రామాల దాహార్తి తీర్చవచ్చు. ఇందులో వెయ్యికోట్లతో అన్ని గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్లు, మరో వెయ్యికోట్లతో బోరుబావులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయవచ్చు. ప్రాధాన్యతలను మరచి ప్రభుత్వం వేల కోట్లు వాటర్‌గ్రిడ్‌కు కేటాయిస్తోంది. ప్రాణహిత-చేవేళ్ల,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను రాబోయే మూడేళ్లలో పూర్తిచేయకుంటే ఓట్లడగమని ప్రభుత్వం ధైర్యంగా ప్రకటించాలి. ప్రజల దృష్టి మళ్లించేందుకే వాటర్‌గ్రిడ్ పథ కాన్ని తెరమీదకు తెచ్చారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయాలి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తున్నాం.     
 - కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
 
 ప్రభుత్వం తీరు రాజ్యాంగ విరుద్ధం
 శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధం. చట్టసభల్లో టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశాలు జరుగుతున్నట్టుంది. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌తో సీఎం కేసీఆర్‌కు భజన చేసేవిధంగా సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైన్ ఏకపక్షంగా చేయడం దారుణం. సీఎం కేసీఆర్ ‘మాటల రావు’గానే మిగిలారు.. ఆయన ‘చేతల రావు’గా మారాలన్నదే మా ఉద్దేశం. విపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తుండడం శోచనీయం. రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలి.     
- పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
 
 అందుబాటులో విత్తనాలు, యూరియా: పోచారం
 సాక్షి, హైదరాబాద్: రైతులు పంటలు వేసుకునేందుకు వీలుగా విత్తనాలు, యూరియా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలి పారు. బుధవారం మండలిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం చెప్పారు. వివిధ రకాలైన ఎరువులకు సంబంధించి 18.32 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకు ప్రణాళికలు రూపొందించగా ఇప్పటికే 11.06 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఖరీఫ్ కోసం 8.50 ఎల్‌ఎంటీల యూరియాను కేంద్రం రాష్ట్రానికి కేటాయించిందని వెల్లడించారు.
 
 4 వేల కిలోమీటర్ల హైవేలు కోరాం: తుమ్మల
 రాష్ట్రంలోని 4,207 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, రహదారుల శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు తెలిపారు. మొదటి దశలో కనీసం 1,015 కి.మీ పొడవున్న 6 రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచాలని గతేడాది డిసెంబర్‌లో మరో సారి సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినట్లు బుధవారం మండలిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మొదటి దశలో 20 కూడళ్లలో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు తుమ్మల పేర్కొన్నారు.

ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాములు నాయక్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం చెప్పారు. అలాగే జీహెచ్‌ఎంసీలో మెత్తం 53 పార్కింగ్ ప్రదేశాలున్నాయని, గతేడాది కన్నా 10 శాతం అదనపు ధర నిర్ణయించి టెండర్ల ద్వారా వాటిని కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పార్కింగ్ ప్రదేశాల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగితే తమ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
 పగటి పూటే 9 గంటల విద్యుత్ : జగదీశ్‌రెడ్డి
 వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రెండు విడతలుగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని బుధవారం మండలిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఒక విడత, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో విడత ద్వారా విద్యుత్ అందజేస్తామని తెలిపారు.
 
 విదేశాల్లో ఉన్నత విద్యకు సహాయం: కడియం
 ఎస్సీ,ఎస్టీలతో పాటు మైనారిటీ విద్యార్థులకు కూడా అంబేద్కర్ విద్యానిధి కింద విదేశాల్లో ఉన్నతవిద్యకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విదేశాల్లో విద్యకు రూ.10 లక్ష లు సరిపోవడం లేదన్న అభిప్రాయం తమ దృష్టికి వచ్చిం దని, స్టడీ, కాలేజీ, వసతి ఖర్చులు ఇతరత్రా పరిశీలించి ఈ మొత్తాన్ని సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని బుధవారం మండలిలో ఎమ్మెల్సీ రాములునాయక్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

 సిటీ బస్సులు జీహెచ్‌ఎంసీకి ఇవ్వం: మహేందర్
 రాజధానిలోని ఆర్టీసీ బస్సు సర్వీసుల పర్యవేక్షణను జీహెచ్‌ఎంసీకి అప్పగించాలన్న నిర్ణయమేదీ లేదని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలిలో ఎంఐఎం సభ్యులు సయ్యద్ అల్తాఫ్జ్వ్రీ, సయ్యద్ అమీనుల్ జాఫ్రీ తదితరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. సిటీ సర్వీసుల ద్వారా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని, 2014-15లో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రూ.188.64 కోట్ల మేర నష్టం వచ్చిందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు