మద్యం సేవించి వాహనాలు నడిపితే కౌన్సెలింగ్‌

25 Apr, 2017 22:21 IST|Sakshi
మద్యం సేవించి వాహనాలు నడిపితే కౌన్సెలింగ్‌
ఏలూరు (మెట్రో) : జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి రెండు రోజులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో ప్రధాన సెంటర్లలో పోలీస్‌లు, రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి రెండు రోజులు పెదవేగిలోని పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూలులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి ఫెనాల్టీ విధించడం వల్ల లాభం లేదని, మరుసటి రోజు మళ్లీ తాగి వాహనాలు నడిపితే అమాయక ప్రాణాలు బలయ్యే ప్రమాదముందని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఏమి జరుగుతుందో కళ్లకు కట్టినట్టు వీడియో దృశ్యాలను చూపించాలని, పోలీస్‌ అధికారులతో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అదే ఫెనాల్టీగా నిర్ధారించాలన్నారు. జాతీయ రహదారులపై 45 బ్లాక్‌ స్పాట్స్‌ను పోలీసు శాఖ గుర్తించిందని, అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్‌ రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. గతుకులతో ఉన్న ప్రాంతాలలో తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో వాహనాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపుతామని, రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దడానికి అందరి సహకారం అవసరమని అన్నారు. సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనరు సత్యనారాయణమూర్తి, ఆర్‌టీసీ ఆర్‌ఎం ఎస్‌.ధనుంజయరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఇ.మాణిక్యం, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.కోటేశ్వరి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, ట్రాఫిక్‌ డీఎస్పీ ఆవుల శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్‌ వై.సాయి శ్రీకాంత్, నేషనల్‌ హైవే అధికారి వెంకటరత్నం పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు