నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

2 Sep, 2016 00:26 IST|Sakshi
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
  • పాల్గొననున్న పలు సంఘాలు
  • మూతపడనున్న వ్యాపార, విద్యాసంస్థలు
  • న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం దేశవ్యాప్త సమ్మెకు పలు సంఘాలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలో సమ్మె జరగనుంది. సమ్మెలో జిల్లాలోని పలు కార్మిక సంఘాలు పాలు పంచుకోనున్నాయి. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఐక్యంగా సమ్మెకు దిగుతుండగా.. పన్నెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. కాగా, సమ్మె సందర్భంగా శుక్రవారం వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు మూతపడనుండగా, రవాణా వ్యవస్థ నిలిచిపోయే అవకాశముంది.
     
    సమ్మె విజయవంతంతో సమాధానం చెప్పాలి
    సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే యత్నాలతో పాటు కార్మికులను గందరగోళానికి గురిచేసేందుకు కేంద్రప్రభుత్వం పన్నుతున్న కుట్రలకు సమ్మెను విజయవంతం చేయడం ద్వారా దీటైన జవాబు చెప్పాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ రాంనగర్‌లోని జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ, బ్యాంక్‌ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ముందు ఉంచిన ఏ సమస్యను పరిష్కరించకుండా కేంద్రమంత్రులు కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు బి.చక్రపాణి, రాగుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
     
    విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి..
    వివిధ కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్‌యు జిల్లా కార్యదర్శి విజయ్‌ఖన్నా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, ఏఐఎస్‌ఎఫ్‌ నగర అధ్యక్షుడు ల్యాదళ్ల శరత్‌ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి సహకరించాలని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో  నాయకులు రవికుమార్, ప్రశాంత్, అశోక్, సురేష్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     
     
    సమ్మెలో గ్రామీణ తపాలా ఉద్యోగులు.
    తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ తపాల ఉద్యోగులకు సివిల్‌ సర్వెంట్‌ హోదా కల్పించాలని, ప్రతీ పోస్టాఫీస్‌ 8 గంటల డ్యూటీ కేటాయించాలనే తదితర డిమాండ్లతో శుక్రవారం సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆల్‌ ఇండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రసిడెండ్‌ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
     
     
    ప్రధాన డిమాండ్లు ఇవే..
     నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి.
    – కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఇవ్వాలి.
    – కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి.
    – అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి.
    – కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి.
    – కార్మిక చట్టాల సవరణను ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థలో వాటా అమ్మకాన్ని నిలిపి వేయాలి.
    – రక్షణ, రైల్వే, బ్యాంక్, ఇన్సూరెన్స్‌ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమంతించొద్దు.
    – రోడ్డు రవాణా, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరిచుకోవాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్‌ చట్టాలను విధిగా అమలుచేస్తూనే పెన్షన్‌ గ్యారంటీ ఇవ్వాలి.
    – 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.
     
    విద్యారణ్యపురి : సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ సంఘాల బాధ్యులు కె.సోమశేఖర్, బద్దం వెంకటరెడ్డి, ఎస్‌.కుమారస్వామి, యూ.అశోక్, కడారి భోగేశ్వర్, టి.సుదర్శనం, టి.లింగారెడ్డి, సుధాకర్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. 

     

మరిన్ని వార్తలు