బాపట్లలో జంట హత్యలు

27 Oct, 2016 22:56 IST|Sakshi
బాపట్లలో జంట హత్యలు
బాపట్ల: కుటుంబ కలహం జంట హత్యలకు దారితీసింది. తల్లీకూతుళ్లను సమీప బంధువే రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. బుధవారం అర్ధరాత్రి బాపట్లలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. మతురాలు గౌరు నాగమణి తల్లి కొట్టె పార్వతి పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం...  పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంకు చెందిన గౌరు నాగేశ్వరరావు, నాగమణి(40) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె సాయిలక్ష్మిని(24)  ప్రకాశం జిల్లా కోరిశపాడు మండలం పిచ్చుకులగుడిపాడులోని నాగమణికి వరుసకు తమ్ముడైన కొట్టె హనుమంతరావుకు ఇచ్చి వివాహం చెశారు. వివాహం జరిగిన మూడేళ్ళ తర్వాత కుటుంబంలో విభేదాలు పొడచూపాయి. దీంతో నాలుగు సంవత్సరాలుగా సాయిలక్ష్మి   ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.
 
హత్యకు నేపథ్యం..
నరాలశెట్టివారిపాలెంలోనే ఉంటున్న గౌరు హనుమంతరావుకు  నాగమణి సోదరుని కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అయితే నాగమణి, సాయిలక్ష్మిలకు గౌరు హనుమంతరావులతో ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం నాగమణి హనుమంతరావుపై కేసు పెట్టింది. అయితే నాగమణి సోదరుడు వచ్చి కుటుంబ వ్యవహారాలను పరిష్కరించుకుంటామని చెప్పి స్టేషన్‌ నుంచి తీసుకువెళ్ళారు. అప్పటికే పలు గొడవల్లో ఉన్న గౌరు హనుమంతరావు నాగమణిపై కక్షపెంచుకుని చంపుతానని బెదిరిస్తే బంధువులు సర్దిచెప్పారు.
 
ఎవరూ లేనప్పుడు చూసుకుని...
నాగమణి భర్త నాగేశ్వరరావు పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ వివిధ గ్రామాలకు వెళుతుంటాడు. బుధవారం ఇంట్లో నాగేశ్వరరావులేని సమయం చూసి రాత్రి 11 గంటల సమయంలో గౌరు హనుమంతరావు ఇంట్లోకి ప్రవేశించి ముందు నాగమణిని అక్కడే ఉన్న రోకలి బండతో కొట్టి చంపాడు. గొడవ జరగటంతో అక్కడే ఉన్న సాయిలక్ష్మి తన తాతయ్యకు ఫోన్‌ చేసేందుకు యత్నించగా ఫోన్‌ను పగలగొట్టి  ఆమెను కూడా రోకలిబండతో కొట్టి చంపాడు. సాయిలక్ష్మి పిల్లలు సందీప్రియ,సందీప్‌  నిద్రలేవటంతో హనుమంతరావు తండ్రి భీమాంజనేయులు, తల్లి లక్ష్మి వచ్చి  పిల్లలను పక్కనే ఉన్న వారి అత్తమామల వద్దకు పంపి..., అక్కడ నుంచి కారులో హనుమంతరావు భార్యను కూడా తీసుకుని నలుగురూ పరారయ్యారు. సంఘటన స్థలానికి వచ్చిన బంధువులు రక్తపుమడుగులో పడి ఉన్నవారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సందీప్రియ జరిగిన విషయాన్ని పోలీసులకు, మీడియాకు తెలియజేసింది.
 
ముగ్గురిపై కేసు నమోదు
సంఘటన స్థలాన్ని డీఎస్పీ మహేష్‌ పరిశీలించారు.  జంటహత్యల కేసులో గౌరు హనుమంతరావు, ఆయన తండ్రి భీమాంజనేయులు,తల్లి లక్ష్మీలపై కేసు నమోదు చేశామని, డాగ్‌స్వా్కడ్‌ కూడా వారి ఇళ్ళకే వెళ్ళినట్లు సీఐ ఆంజనేయులు  తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి వారిని పట్టుకుంటామని సీఐ  తెలిపారు. 
మరిన్ని వార్తలు