కారంపూడిలో దంపతుల ఆత్మహత్య

21 Jul, 2016 18:42 IST|Sakshi

కుటుంబ సమస్యలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో యువ దంపతులు ఉరిపోసుకుని బలవన్మరణం పొందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కారంపూడిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఆంధ్రా బ్యాంకు వీధిలో కట్టమూరి ప్రసన్నాంజనేయులు (38), సావిత్రి (30) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున భార్యాభర్తలు గొడవపడ్డారు. తర్వాత ప్రసన్నాంజనేయులు బయటికి వెళ్లాడు.. భార్య పిల్లలను నిద్రలేపి బ్రష్ చేసుకోవడానికి పంపి.. తర్వాత ఒక లేఖ రాసి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంటికి తిరిగి వచ్చిన ఆంజనేయులు భార్య ఉరిపోసుకుని మృతి చెందడాన్ని గమనించి మేనమామకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత అతడు కూడా ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. కిందనుంచి మేడ మీదకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు వేలాడడాన్ని చూసి.. గట్టిగా ఏడవటం మొదలు పెట్టారు. మంచి నీటి క్యాన్ ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తి .. వీరిని గమనించి.. ఇరుగు పొరుగు వారికి తెలిపాడు. ప్రసన్నాంజనేయులు గ్రామంలో టీడీపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనే వాడు.  బియ్యం, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తుంటాడని  ఎస్.ఐ. పెదనారాయణస్వామి తెలిపారు.

 అప్పుల బాధతో అల్లుడు, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని సావిత్రి తండ్రి బచ్చు కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు.


అనాథలైన చిన్నారులు
ప్రసన్నాంజనేయులు అక్కయ్య శేషమ్మ కుమార్తె సావిత్రిని పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారికి శేషు (7), లోకేష్ (5) ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. కుటుంబమంతా షిరిడీ వెళ్లి బుధవారమే ఇంటికి తిరిగివచ్చారు. మరుసటి రోజే ఈ సంఘటన జరిగింది.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు