పాలకుడు చేసిన పాపం...అక్క చెల్లెళ్లకు శాపం

13 Jul, 2016 08:28 IST|Sakshi
పాలకుడు చేసిన పాపం...అక్క చెల్లెళ్లకు శాపం

- పశ్చిమగోదావరిలో డ్వాక్రా మహిళలకు కోర్టు సమన్లు
- నాడు రుణాలన్నీ మాఫీ అన్నారు.. ఇపుడు కోర్టులకీడుస్తున్నారు..
- ఘొల్లుమంటున్న డ్వాక్రా మహిళలు..అప్పు చెల్లించినా కొందరికి సమన్లు
 
సాక్షి, నరసాపురం : ‘డ్వాక్రా మహిళలూ.. మీరు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల బకాయిల్లో ఒక్క పైసా కూడా కట్టొద్దు. నేను అధికారంలోకి రాగానే మీ అప్పులన్నీ మాఫీ చేసేస్తా’ ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఎన్నికలయిపోయాయి.. వాగ్దానాలన్నీ అటకెక్కిపోయాయి... డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలలో పైసా కూడా మాఫీ కాలేదు. అప్పులు తడిసిమోపెడయ్యాయి. వడ్డీలు తలకుమించిన భారంగా పరిణమించాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో బ్యాంకుల నుంచి నోటీసులు, వత్తిళ్లతో మహిళలు సతమతమవుతున్నారు. ఇదే తరుణంలో వారి తలపై మరో పిడుగుపడింది. కోర్టుల నుంచి ఏకంగా సమన్లు అందుతున్నాయి. తక్షణమే అప్పు చెల్లించాలని... లేదంటే కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందన్నది ఆ సమన్ల సారాంశం. కోర్టు సమన్లతో మహిళలంతా బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు రెండురోజులుగా కోర్టు సమన్లు అందుతున్నాయి. అసలు అప్పు తీసుకోని వారికి సైతం సమన్లు అందుతుండడంతో వారు ఘొల్లుమంటున్నారు.

 బకాయి మొత్తం చెల్లించినా..
 సీతారామపురంలోని 7 గ్రూపులకు చెందిన 70 మంది మహిళలు 2009-13 సంవత్సరాల మధ్య గ్రామంలోని ఎస్‌బీఐ శాఖ నుంచి అప్పు తీసుకున్నారు. వారిలో చాలామంది ఆ మొత్తాలను తిరిగి చెల్లించారు. అయినా ఇంకా బకాయిలు ఉన్నాయని, తక్షణమే వాటిని చెల్లించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవంటూ నరసాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి అందరికీ సమన్లు అందాయి. అప్పు తీసుకున్నవారికి, తీసుకోని వారికి, అప్పు కట్టేసిన వారికి కూడా ఈ నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బకాయిదారులంతా న్యాయవాది ద్వారా కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో ఆగస్టు 9న కోర్టుకు హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు.

బకాయి చెల్లించినా నోటీసులు వచ్చాయని, ఆ అప్పులతో సంబంధం లేని వారికీ నోటీసులు ఇచ్చారని మహిళలు చెబుతున్నారు. బ్యాంకుకు వెళ్లి నోటీసులు గురించి అడిగితే కోర్టులో తేల్చుకోండని బ్యాంకు అధికారులు సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కోర్టుకు వెళ్లాల్సినంత తప్పు ఏం చేశామని వాపోతున్నారు. ఈ మహిళలు బ్యాంకు నుంచి రూ.17 లక్షల రుణం తీసుకున్నారు. అయితే వడ్డీతో కలిపి రూ.28 లక్షలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొనడం విశేషం. దీంతో దిక్కుతోచని మహిళలు ఏం చేయాలో తెలియక ఐకేపీ కార్యాలయాల చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం తమ పరిధిలో లేదని, కోర్టు ద్వారానే తేల్చుకోండని బ్యాంకు అధికారులు సమాధానం ఇవ్వడంతో అవాక్కవుతున్నారు.

మహిళల ఆందోళనబాట...
కోర్టు నుంచి సమన్లు అందుకున్న మహిళలంతా తమను నిలువునా మోసం చేసిన చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా ఆందోళన బాటపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. స్పందన, విజయా సింగ్, ప్రియాంక గాంధీ, జ్యోతి, అరుణ, ప్రియదర్శిని గ్రూపులకు చెందిన సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమబాట పట్టాలని, అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని నిర్ణయించారు.
 
సొమ్ము మొత్తం కట్టేశాను
2008లో బ్యాంకు నుంచి రూ.20 వేలు అప్పు తీసుకున్నా. వడ్డీతో పాటు తిరిగి  చెల్లించాను. ఇప్పుడు రూ.2 లక్షలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.
 - పిల్లి అనితాబాబూజీ, పిల్లివారి పేట, సీతారామపురం
 
కట్టినవారికీ సమన్లు దుర్మార్గం
మా గ్రూపులో ఎవరైనా సొమ్ము చెల్లించకపోతే వారికి నోటీసులు ఇవ్వాలి. అంతేతప్ప లక్షల్లో అప్పు ఉన్నారంటూ మిగతా వారందరికీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గం.
- పట్టా లక్ష్మీకాంతం,పిల్లివారి పేట, సీతారామపురం
 
వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు
బ్యాంకులో 2008-13 మధ్య కాలంలో డ్వాక్రా రుణాలు పొందిన 70 మంది మహిళలకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేశాం. ఈ రుణాలన్నీ స్వయం సహాయక సంఘాల ద్వారా  తీసుకున్నవే. ఏ ఒక్కరు చెల్లించకపోయినా గ్రూపు సభ్యులందరూ బాధ్యులే. ప్రస్తుతం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంది.
-పి.వాసుదేవరావు, బ్యాంక్ మేనేజర్

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా