అంబా...అని అరిచినా...

19 Jul, 2017 23:06 IST|Sakshi
అంబా...అని అరిచినా...
ఒకే రోజు 20 ఆవుల మృత్యువాత
కమిటీ సభ్యుల నిర్లక్ష్యం బట్టబయలు
ఏడాదిగా విమర్శలున్నా పట్టించుకోని అధికారులు
కాకినాడ రూరల్‌: గోవు సర్వ దేవతల స్వరూపమని హిందూ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందుకే గోవును హిందువులు తల్లి లాంటిదని, పాలిచ్చి పెంచేదని, అది ఎంతో పవిత్రమైందిగా భావిస్తూ దాన్ని గోమాతగా పూజిస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో చేసే ముత్యాల ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టేందుకు ఆవుపేడను ఉపయోగిస్తారంటే దాని ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. అలాంటి పవిత్ర గోమాతలకు రక్షణగా ఉండాల్సిన జంతు హింస నివారణ సంఘం ఆశ్రమ కమిటీ సభ్యులు నిర్లక్ష్యం చూపించడంతో ఆవులు చనిపోవడం ప్రారంభించాయి. ఈ ఆవరణంతా బురద, దోమలు, అడుగు వేస్తే ఊబిలో దిగబడిపోయే విధంగా ఉండడంతో గత ఐదారు రోజులుగా వందలాది ఆవులు ఒంటి కాళ్లపై నిలబడి ఉండడం, సరైన పశుగ్రాసం లేకపోవడంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే  20కి పైగా ఆవులు చనిపోవడం చూస్తే నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు, ఇతరేతర సంఘాలకు చెందిన వారు స్థానికంగా రోడ్లపై తిరిగే ఆవులను, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గోవధకు తరలిస్తున్న ఆవులను పట్టుకొని ఈ సంఘ సభ్యులకు అప్పగిస్తారు. తీరా ఇక్కడకు వచ్చిన తరువాత మేత లేకపోవడంతో అనేక ఆవులు మృత్యువాత పడుతుంటాయి. మరికొన్ని ఆవులను ఇక్కడ నుంచి తరస్తుంటారు... అయితే ఇవి ఎక్కడికి తరలిస్తారనేది ఎవరికీ తెలియని ప్రశ్నగానే ఉందని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మొత్తం దాతల విరాళాలపైనే నడుస్తుంది. గతంలో ప్రభుత్వం ఈ సంస్థ నిర్వహణకు కొంత నిధులు కేటాయించేదని, సంఘం తమదంటే తమదని రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల కోర్టుకు వెళ్లడంతో నిధులు నిలిపివేయడంతో కొత్త చిక్కులు ఏర్పడ్డాయని సంఘ సభ్యులే చెబుతున్నారు. తరువాత పూర్తిగా విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
సంరక్షణ సరిగ్గా లేక...
గోవులకు మేత కూడా సరిగ్గా వేయకపోవడంతో అవి బక్కచిక్కి మృత్యువాత పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవగాహన లేకపోవడంతో ఇష్టమొచ్చిన రీతిగా కోత గడ్డికి బదులుగా మిషన్‌ గడ్డిని పెట్టడంతో అవి తినలేక బక్కచిక్కి ఆకలితో అలమటిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో ఆవుకు 11 కేజీల పచ్చిగడ్డి పెట్టాలి. కాని ఇక్కడ పచ్చిగడ్డి అనేదే కనిపించదు. 
కదిలిన అధికార యంత్రాంగం...
ఈ ప్రాంగణంలో ఒకే రోజు 20కి పైగా ఆవులు చనిపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. పశుగ్రాసం కరువుతోనే ఆవులు మరణించినట్లు అధికారులు నిర్థారించారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా పశువైద్య జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్టీవో రఘుబాబుల పర్యవేక్షణలో 27 మంది పశువైద్యులు బుధవారం ఉదయమే జంతుహింస నివారణ సంఘానికి చేరుకొని పశువులకు ఇంజెక‌్షన్లు చేశారు. 10 నుంచి 20 వరకు ఆవులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. అధికారులు విచారణ చేస్తున్న సమయంలో సంఘ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఒకానొక సమయంలో ముష్టి ఘాతాలకు దిగారు. ప్రస్తుతం ఉన్న సంఘాన్ని రద్దు చేసి, స్థానికంగా ఉన్న పెద్దలకు నిర్వహణ అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మూగ జీవులను అమ్ముకొంటున్నారని ఉన్న జీవాలకు కనీసం గడ్డి కూడా వేయడంలేదంటూ స్థానికులు అధికారుల ఎదుట ఆందోళన చేశారు. దీనిపై పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానని జేడీ వెంకటేశ్వరరావు వివరించారు. ప్రత్యేక జేసీబీతో ఆ ప్రాంతంలో ఉన్న ఊబిలా మారిన బురదను తొలగించే పనులు చేపట్టారు. ఈ విచారణ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆలీంబాషా, కాకినాడ అర్బన్‌ తహసీల్దార్‌ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు