వైఎస్‌ విగ్రహ ధ్వంసం పిరికిపందల చర్య

10 Apr, 2017 23:28 IST|Sakshi
వైఎస్‌ విగ్రహ ధ్వంసం పిరికిపందల చర్య
  •   మంత్రి అండదండలతోనే విధ్వంసాలు
  • రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం
  • విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
  • నిరశన కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
  •  

    చెన్నేకొత్తపల్లి : అధికారంలో ఉన్నవారు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి కానీ అల్లరిమూకలను ప్రేరేపించడం సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ టీడీపీ నాయకులకు హితవు పలికారు. రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని, చంద్రబాబునాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లిలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్‌ విగ్రహం వద్ద శాంతియుత నిరశన కార్యక్రమం చేపట్టారు. శంకరనారాయణతోపాటు రాప్తాడు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మైలారపు రమణారెడ్డి, పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, శింగనమలతోపాటు మరిన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ వారి ఆగడాలు శృతి మించాయన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటివరకు నాలుగుచోట్ల వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మంత్రి అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ఇది నీతిమాలిన పిరికిపందల చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, తమ సహనాన్ని చేతగానితనంగా భావించి రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. వైఎస్‌ విగ్రహం «ధ్వంసం చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం న్యామద్దెల సర్కిల్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ప్రభుత్వానికి, మంత్రి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి రామగిరి సీఐ యుగంధర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మెట్టుగోవిందరెడ్డి, స్థానిక సర్పంచ్‌ క్రిష్ణారెడ్డి, న్యామద్దెల ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, దామాజిపల్లి సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సొసైటీ డైరెక్టర్‌  ప్యాదిండి నరసింహారెడ్డి, నాయకులు గాలిశ్రీనివాసరెడ్డి, పుల్లారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, లింగమయ్య, హరినాథ్‌రెడ్డి, క్రిష్ణమూర్తి, రామాంజి, నగేష్, రాప్తాడు మండల కన్వీనర్‌ రామాంజినేయులు, వరప్రసాద్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, సాకే నారాయణ, నందకుమార్‌రెడ్డి, లింగారెడ్డి, చిన్ననరసింహులు, ప్రతాప్, జయరామిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తాతిరెడ్డి, చంద్రశేర్‌రెడ్డి, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.

    ఎదుర్కొనే ధైర్యంలేకే...

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేకే మంత్రి అనుచరుల అండదండలతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారని రాప్తాడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మైలారపు రమణారెడ్డి అన్నారు. ఆయన నిరశన కార్యక్రమానికి మద్దతు పలికి ర్యాలీలో పాల్గొన్నారు. అధికార పార్టీ వారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్‌ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. ప్రశాంతంగా ఉన్న చెన్నేకొత్తపల్లిలోనూ చిచ్చు పెట్టేందుకే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. మంత్రి అల్లరిమూకలను పెంచి పోషిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాప్తాడు మండల కన్వీనర్‌ బోయ రామాంజినేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయన్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీతకు పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ శిశు సంక్షేమశాఖను అప్పగించినా బుద్ధి రాలేదన్నారు.

మరిన్ని వార్తలు