ఆవుల తరలింపు గుట్టురట్టు

30 Jul, 2016 21:20 IST|Sakshi
ఆవుల తరలింపు గుట్టురట్టు
  • ప్రమాదానికి గురైన వాహనం 
  • అపస్మారక స్థితిలో డ్రైవర్‌.. ఇద్దరు పరారీ
  • కంటైనర్‌నుంచి వంద ఆవులను వెలికితీసిన స్థానికులు
ఆలమూరు :
అక్రమంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్న విషయం ఓ రోడ్డు ప్రమాదంతో బయటపడింది. స్థానికుల కథనం ప్రకారం పదహారో నంబరు జాతీయ రహదారిలోని జొన్నాడ జంక్షన్‌ వద్ద ఒడిశా నుంచి తమిళనాడు వెళుతున్న కంటైనర్‌ మచిలీపట్నం నుంచి మండపేట వస్తున్న లారీని శనివారం ఢీకొట్టింది. దాంతో కంటైనర్‌ క్యాబిన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురిలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. మిగిలిన ఇద్దరూ పరారయ్యారు. అది స్థానికుల్లో అనుమానాలను రేకేత్తించింది. ఈ అనుమానమే బారీ స్థాయిలో గోవుల తరలింపును గుట్టురట్టు చేసింది. రహదారికి అడ్డంగా ఉందని ఆలమూరు పోలీసులు కంటైనర్‌ను క్రేన్‌ సాయంతో పక్కకు తీసేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా అనిపించింది. దాంతో పోలీసులు కంటైనర్‌ వెనుక భాగాన్ని తెరచి చూడగా భయంకరమైన పరిస్థితుల్లో గోవులు కంటబడ్డాయి. ద్విచక్రవాహనాలు తరలించే అకంటైనర్‌ రెండు అరల్లో సుమారు 100 ఆవులను కుక్కేశారు. పైభాగంలో ఉన్న గోవులను కాళ్లు విరిచి కదలడానికి వీలు లేకుండా కట్టిపడేశారు. స్థానిక యువకులు ఆగోవులన్నింటిని తీవ్ర ప్రయాసలకోర్చి బయటకు తీశారు. వాటిలో రెండు గోవులు మృతి చెందగా మరో ఐదు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని స్వీకరించేందుకు గో సంరక్షణ సమితి నిరాకరించడంతో స్థానిక పోలీసులు పెంచుకునేందుకు ఆసక్తి కనబర్చిన రైతులకు ఆగోవులను అప్పగించారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న కంటైనర్‌ డ్రైవర్‌ను ఎన్‌హెచ్‌ 16 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకుంటే కాని నిందితుల ఆచూకీ లభించని పరిస్థితి ఏర్పడింది. ఈమేరకు ఆలమూరు ఎస్సై ఎం.శేఖర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
గోవుల తరలింపుపై కఠినంగా వ్యవహరించాలి
రాష్ట్రంలో గోవుల తరలింపుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కొత్తపేట నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి టి.రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. అక్రమార్కులు గోవులను లారీల్లో కాకుండా కంటైనర్లలో తరలించడాన్ని బట్టి ఈవ్యాపారం ఏస్థాయిలో జరుగుతుందో అర్థమవుతుందన్నారు. గోవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా దళాన్ని నియమించాలని సూచించారు. గాయపడ్డ గోవులకు సకాలంలో వైద్యం అందలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తంచేశారు. 
 

 

మరిన్ని వార్తలు