‘రైతుకు అన్యాయం చేస్తే ప్రత్యక్ష ఆందోళన’

16 Jun, 2017 22:05 IST|Sakshi
‘రైతుకు అన్యాయం చేస్తే ప్రత్యక్ష ఆందోళన’

అనంతపురం అగ్రికల్చర్‌ : కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న జిల్లా రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌ హెచ్చరించారు. జిల్లాకు మంజూరైన ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతావరణ బీమాలను రైతుల ఖాతాల్లో వేర్వేరుగా జమ చేయాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ... ఇన్‌పుట్‌కు ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి బక్కచిక్కిన రైతులను దగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుటిల యత్నం చేస్తోందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం వాటా, ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇచ్చిన మొత్తాన్ని రైతులకు చెల్లించడానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జేడీఏ పీవీ శ్రీరామమూర్తి ఎదుట నినాదాలు చేస్తూ ఘెరావ్‌ చేసే యత్నం చేశారు. రైతుల జాబితా సిద్ధమైందని, శుక్రవారం నుంచే ప్రక్రియ ప్రారంభించామని, పది రోజుల్లోగా పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి చర్యలు చేపట్టామని జేడీఏ వివరణ ఇచ్చారు.  రైతులకు న్యాయం జరగకపోతే మరోసారి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని నేతలు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు