సీమకు ఏం చేశారు?

18 May, 2017 00:08 IST|Sakshi
సీమకు ఏం చేశారు?

శ్వేతపత్రం విడుదల చేయాలి
రైతు ఆక్రందన పట్టని దున్నపోతు ప్రభుత్వమిది
రైతుల కోసం కాకుండా బీమా కంపెనీల కోసమే పాకులాట
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వామపక్ష నేతల ధ్వజం
ముగిసిన 30 గంటల ‘కరువుపై రాయలసీమ బైఠాయింపు’
కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం, నాయకుల అరెస్ట్‌, విడుదల


అనంతపురం అర్బన్‌ : రాయలసీమ అభివృద్ధి కోసం ఈ మూడేళ్లలో టీడీపీ సర్కార్‌ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దున్నపోతు ప్రభుత్వం పాలన సాగుతోందని, అందుకే రైతుల ఆక్రందనపై స్పందన కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ‘సీమ’కు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటలపాటు చేపట్టిన ‘కరువుపై రాలయసీమ బైఠాయింపు’ బుధవారం ముగిసింది. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు డి.జగదీశ్, వి.రాంభూపాల్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు తదితరులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం కాకుండా బీమా కంపెనీల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు.

జిల్లాలో ఉపాధి కూలీలకు రూ.59 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. 2011 నుంచి రిలయన్స్, బజాజ్‌ కంపెనీలు ‘సీమ’ రైతుల నుంచి ప్రీమియం రూపంలో రూ.11.15 వేల కోట్లు వసూలు చేశాయన్నారు. అయితే రైతులకు ఇచ్చింది కేవలం రూ.1,142 కోట్లేనన్నారు.  ఒకవైపు రైతులు ఆత్మహత్మ చేసుకుంటున్నా, కూలీలు పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నా... టీడీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాయలసీమకు 100 టీఎంసీల నీరు ఇవ్వాలని, శాశ్వత కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, నీళ్లు, నిధులు ఇవ్వాని డిమాండ్‌ చేశారు. వాటిని సాధించే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ నెల 24న చేపడుతున్న రాయసీమ బంద్‌లో అన్ని వర్గాలు పాల్గొని ‘సీమ’ తడాఖాను ప్రభుత్వానికి చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కలెక్టరేట్‌ ముట్టడి యత్నం భగ్నం
‘కరువుపై బైఠాయింపు’ సభ ముగిసిన తర్వాత కలెక్టరేట్‌ ముట్టడికి నాయకులు ప్రయత్నించగా పోలీసులు భగ్నం చేశారు. గేటు వద్దే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ,  నాయకులు జి.ఓబులు, జగదీశ్, రాంభూపాల్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అరెస్టులు చేస్తున్న క్రమంలో వైఎస్సార్‌ జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య సొమ్మసిల్లి పడిపోయారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు