మాస్టర్‌ ప్లాన్‌పై అఖిల పక్షం వేయాలి

12 Dec, 2016 14:47 IST|Sakshi
మాస్టర్‌ ప్లాన్‌పై అఖిల పక్షం వేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌ డిమాండ్‌
కోటగ్ముమం (రాజమహేంద్రవరం) : రాజమహేందవరం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశంలో ఇటీవల  ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌ ఏకపక్షంగా జరిగిందని, దీనిపై అఖిలపక్షం వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 గ్రామాలను విలీనం చేస్తూ తయారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌పై గ్రామసభలు పెట్టి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుచరులకు లాభం చేకూర్చే విధంగా మాస్టర్‌ ప్లాన్‌ మార్పులు చేశారని ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం విలీన మండలాల్లో తమ పార్టీ 25 రోజుల పాటు 250 గ్రామాల్లో పాదయాత్ర చేస్తే అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. విలీన మండలాలను చంద్రబాబు ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యానికి గురి చేస్తోందన్నారు.  తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలను కూడా ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. పీహచ్‌సీల్లో గర్భిణులు ప్రసవానికి ఇంటి నుంచి బకెట్లతో నీరు మోసుకోవాల్సిన దుస్థితన్నారు. 50 రోజులు దాటినా ప్రజలకు నోట్ల కష్టాలు తీరలేదని, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎం నాయకులు ఎస్‌ఎస్‌ మూర్తి, బీబీ నాయుడు, ఎన్‌ భీమేశ్వరరావు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు