'చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి'

6 Aug, 2015 20:19 IST|Sakshi

చిత్తూరు(శాంతిపురం): రైతుల ఉసురు పోసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయూనికి ఎంపిక చేసిన ప్రాంతంలోని గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు. అనంతరం కనువులదొడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి రైతులు విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పేద రైతుల ఆధీనంలోని లక్షలాది ఎకరాల భూమిని లాక్కుని ల్యాండ్ బ్యాంకు పేరుతో కోట్ల రూపాయలు దండుకునే కుట్ర సాగుతోందన్నారు. రాజధాని కోసం 4 లేదా 5 వేల ఎకరాలు సరిపోతాయని నిపుణులు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా 50 వేల ఎకరాలు స్వాధీనం చేసుకుంటోందన్నారు. మొత్తం భూమిని రియల్టర్లకు ఇచ్చి లీజు పేరుతో ప్రభుత్వ పెద్దలు దోచుకునే ప్రయుత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్‌ఆర్ సీపీ, సీపీఐ, కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్ష పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బాధిత రైతులను ఒక్కటి చేసి ప్రభుత్వ మెడలు వంచుతామని చెప్పారు. దీనిపై మిగతా పార్టీలతో చర్చించి చలో అసెంబ్లీ, లేదా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కుప్పంలో ఆటవిక రాజ్యం నడపాలని చంద్రబాబు అనుకుంటే ఇకపై సాగదని హెచ్చరించారు. గతంలో కమ్యూనిస్టు నాయకుడు గఫూర్ కుప్పంలో జరప తలపెట్టిన సభను అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇక్కడి పోలీసుల పనితీరుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు