విజయవాడ మేయర్ శ్రీధరా.. నారాయణా..?

30 Apr, 2016 08:53 IST|Sakshi

విజయవాడ  : నగర మేయర్ కోనేరు శ్రీధరా? మంత్రి నారాయణ? అర్థం కాని పరిస్థితి నెలకొందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఎద్దేవా చేశారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కౌన్సిల్‌తో నిమిత్తం లేకుండా మంత్రి నారాయణ నీటి మీటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

మీటర్ల ఏర్పాటుకు అధికారులు హడావిడి చేస్తున్నా మేయర్ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా నీటిమీటర్లను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన టీడీపీ అధికారంలోకి రాగానే తన నిజస్వరూపం బయటపెట్టిందన్నారు.

ప్రజలు సమస్యలతో విలవిలలాడుతుంటే కార్పొరేటర్లు అధ్యయన యాత్ర పేరుతో విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎంతవరకు సబబని దోనేపూడి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖ సారాంశాన్ని చదివి వినిపించారు. నగర పాలక సంస్థ రూ.350 కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్లానింగ్, నాన్‌ప్లానింగ్ గ్రాంట్ రాబట్టాలని డిమాండ్ చేశారు.  పల్లా సూర్యారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు