'సదావర్తి'లో లోకేశ్ చక్రం తిప్పారు..

11 Aug, 2016 18:20 IST|Sakshi
'సదావర్తి'లో లోకేశ్ చక్రం తిప్పారు..

అనంతపురం : సదావర్తి సత్రం భూముల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో ఆయన కుమారుడు లోకేశ్ చక్రం తిప్పారని, పట్టపగలే దోపిడీకి సిద్ధపడ్డారని విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఎకరా భూమి రూ. 7.28 కోట్లు ఉండగా 83.11 ఎకరాలను కేవలం 22.44 కోట్లకు అప్పగించడం వెనుక ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయనేది సుస్పష్టమన్నారు. వేలం నిర్వహణలో నిబంధనలు పాటించలేదని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ నిర్ధారించారని గుర్తు చేశారు. చెన్నైలోని సదావర్తి భూముల కుంభకోణం వెనుక చంద్రబాబు, లోకేశ్ హస్తం ఉందన్న రామకృష్ణ... ఏపీ ప్రభుత్వంలో చేతకాని దద్ధమ్మలే ఎక్కువమంది ఉన్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే తక్షణం వేలం రద్దు చేసి, సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.  

ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దొంగాట ఆడుతోందన్నారు. పుష్కరాల తర్వాత శుభవార్త వింటారని, వెంకయ్యకు ఆరోగ్యం బాగోలేక కలవలేకపోయాయని, తరువాత ఆయనతో మాట్లాడతానని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పడం పచ్చి ఆబద్ధమన్నారు.  తీవ్రమైన జ్వరం కారణంగా వెంకయ్య నాయుడుతో చర్చించలేదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన చెప్పిన రోజునే వెంకయ్య ఎమ్మార్పీఎస్ ధర్నాలో పాల్గొన్నారన్నారు.

ప్రత్యేక హోదా ప్రకటించేందుకు, పుష్కరాలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హదా ఇచ్చేవరకు పోరాటం ఆగదన్నారు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారల్ ధరలు భారీగా తగ్గినా.. పెట్రో ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఎఫ్‌డీఐలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. దీనికి నిరనసగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు