రైతులపై కేసులు పెట్టడం అన్యాయం

29 May, 2017 23:30 IST|Sakshi
రైతులపై కేసులు పెట్టడం అన్యాయం
- సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌
కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : నష్ట పరిహారం చెల్లించకుండా తమ భూముల జోలికి వెళ్ళవద్దన్న రైతులపై 356 సెక్షన్‌ కింద నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యని సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్‌ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం భూ సేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయకుండా వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.  పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం పురుషోత్తపట్నం, రామచంద్రరావు పేట, నాగం పేట, చిన కొండేపూడి, వంగలపూడి గ్రామాల్లో 240 ఎకరాలు సేకరిస్తోందన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక ఎత్తిపోతల పథకాల కింద రైతుల భూములను లాక్కొందని, ఉన్న కాస్త భూమిని కూడా ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరిట స్వాధీనం చేసుకుంటోందన్నారు. మూడు పంటలు పండే భూమికి కేవలం రూ. 17.50 లక్షలు, రూ.19.50 లక్షలు ఇస్తామనడం దారుణమన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎకరాకు రూ. 40 లక్షలు పలుకుతోందన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులకు రూ. 28 లక్షలు ఇవ్వడానికి అవార్డ్‌ ప్రకటించారని, ఒప్పందం కదుర్చుకోకుండా కోర్టుకు వెళ్ళిన రైతుల నుంచి మాత్రం బలవంతంగా భూమిని లాక్కోవడానికి చూస్తున్నారన్నారు. రైతుల తరపున పోరాడేందుకు వెళ్ళిన రాజకీయ పార్టీల ప్రతినిధులను సీతానగరంలోనే అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయ బద్ధంగా నష్ట పరిహారం చెల్లించిన తరువాతే భూములు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. రైతు నాయకుడు సతీష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో భూమికి భూమి కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. భూమి కోల్పోతే తమకు భవిష్యత్తు లేదన్నారు. పుష్కర 1, 2 కాలువలను ఈ పథకం కోసం వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతుల నుంచి భూమిని లాక్కోంటోందన్నారు. సీపీఎం నగర కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, పురుషోత్తపట్నం రైతులు రాంబాబు, సతీష్, తాతారావు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు