హోదా కోరితే అరెస్టులా?

27 Jan, 2017 23:49 IST|Sakshi
హోదా కోరితే అరెస్టులా?

- ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
- సీపీఎం నాయకుల ధ్వజం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం


అనంతపురం అర్బన్‌ : ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అరెస్టులను నిరసిస్తూ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక టవర్‌ క్లాక్‌ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడారు. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌లో అప్పటి పీఎం మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారన్నారు. ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేస్తే,  చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి పదిహేనేళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు.

ఆ మేరకు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా హామీని కేంద్రం విస్మరిస్తే, చంద్రబాబు దాసోహం అయ్యారన్నారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షం నాయకులను గృహ నిర్బంధం చేయడం దారుణన్నారు. ఉద్యమాలను అధికారంతో అణచాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. హామీలను అమలు చేయని ప్రభుత్వాలకు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గోపాల్, ప్రకాశ్, నాగప్ప, చండ్రాయుడు, వలి, రామిరెడ్డి, బాబా, డీవైఎఫ్‌ఐ నాయకులు బాలకృష్ణ, రాజు, íసీఐటీయూ నాయకులు వెంకటనారాయణ, లక్ష్మీనారాయణ, రఘు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమేశ్, సూర్యచంద్ర, జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు