ఆక్వా చెరువులతో మానవ విధ్వంసం

22 Feb, 2017 23:03 IST|Sakshi
ఆక్వా చెరువులతో మానవ విధ్వంసం
చంద్రబాబు వచ్చాకే  విచ్చలవిడితనం  
త్వరలో ఎంపీ, ఎమ్మెల్యేల  ఇళ్ల ముట్టడి 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు 
అమలాపురం రూరల్‌/ అల్లవరం/ ఉప్పలగుప్తం :  ఆక్వాసాగు కోనసీమ మానవ మనుగడను ప్రశ్నార్థ్ధకం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి బాబు సర్కారే కారణమని ఆయన విమర్శిం చారు. అక్రమ సా గును ప్రోత్సహిస్తున్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమ ఆక్వాసాగు పరిశీలనకు కోనసీమలో బుధవారం ఆయన రాజోలు, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆక్వాసాగును ప్రపంచ దేశాలు నిషేధిస్తున్నాయని, మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో నిషేధముందని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాక ఆక్వా సాగుకు తలుపులు బార్లా తెరిచారని, ఆక్వా హబ్‌ పేరుతో విలువైన మాగాణి భూములను బీళ్లుగా మార్చి అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఈ సాగు వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవుపెట్టారు. గూడాలలో మహిళలు మాట్లాడుతూ అక్రమ చెరువులను అడ్డుకున్నవారిపై అక్రమంగా కేసులు పెట్టి భయపెడుతున్నారని, 11 మందిపై కేసులు పెట్టి, జైల్లో పెట్టి తవ్వకాలు సాగించారని వివరించారు. ఉప్పలగుప్తం మండలం శింగరాయపాలెంలో మహిళలు, స్థానికులు ఆక్వా సాగు వల్ల తమకు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. అమలాపురం మండలంలో తాండవపల్లి, వన్నెచింతలపూడి, భట్నవిల్లిలో బాధితులతో ఆయన మాట్లాడారు. కోర్టు స్టే ఇచ్చినా కూడా చెరువు తవ్వకాలు ఆపడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. మధు వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడాల సుబ్బారావు, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి మోర్తా రాజశేఖర్, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రమణి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వసంతకుమార్, ఆ పార్టీ నాయకులు ఉడుపూడి రాఘవమ్మ, టి.నాగవరలక్ష్మి, భీమాల శ్రీను, వి.దొరబాబు, టి.ప్రసాద్, బి.వెంకట్రావులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు