నీర్వికుంటే 9న రాస్తారోకో

6 Sep, 2016 21:09 IST|Sakshi
నీర్వికుంటే 9న రాస్తారోకో
 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు 
 
భవానీపురం :
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 7వ తేదీ లోపు కరెంటు, నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే 9న రాస్తారోకోకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. బాధితులందరూ ప్రతిఘటిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. నదీ తీరం సుందరీకరణ పేరుతో విజయవాడ భవానీపురం కరకట్టపైగల కొన్ని ఇళ్లను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. తమకు సముచితమైన నష్టపరిహారం ఇచ్చేవరకు ఇళ్లను తొలగించేందుకు వీలులేదంటూ దాదాపు 70 మంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వారికి కరెంటు, తాగునీటిని బంద్‌ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. రెండు నెలలకుపైగా కరెంటు, నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. వారం రోజులలోపు బాధితులకు కరెంటు, నీటి వసతిని పునరుద్ధరించాలని ఈనెల 1వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఆరు రోజులైనా బాధితులకు న్యాయం జరకపోవడంతో సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ కరకట్టకు వచ్చి బాధితులతో మాట్లాడారు.  మధు మాట్లాడుతూ బాధితులకు 100 గజాల స్థలం, నష్టపరిహారం ఇచ్చి వారి ఇళ్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి కాశీనాథ్‌ మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన అధికారులను అరెస్ట్‌ చేయాలన్నారు. వెస్ట్‌ జోన్‌ నాయకులు  యువీ రామరాజు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబు, పేద ప్రజలు అదే కోర్టు నుంచి తెచ్చుకున్న స్టే ఆర్డర్‌ను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు ఎల్‌.మోహన్‌రావు, ఎస్‌ సుబ్బారెడ్డి బాధితులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు