జీవనాధారమే ఉసురు తీసింది

19 Apr, 2017 01:17 IST|Sakshi
జీవనాధారమే ఉసురు తీసింది
తణుకు : కుటుంబానికి జీవనాధారంగా నిలిచిన కుటీర పరిశ్రమే వారిని కబళించింది. వారు తయారు చేసిన బాణసంచా భార్యాభర్తల్ని సజీవ దహనం చేసింది. తణుకు మండలం దువ్వలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో వేగిరౌతు సత్యనారాయణ (55), ఆయన భార్య మణికుమారి (50) సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో బాణసంచా పెద్దఎత్తున పేలడంతో ఇంట్లో ఉన్నవారిని రక్షించేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు నివసిస్తున్న రెండు పోర్షన్ల తాటాకిల్లు నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైంది. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బొగ్గుల్లా మారాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రమాదంతో దువ్వలో విషాదఛాయలు అలముకున్నాయి. 
ఇంట్లోనే నిల్వ
ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మృతుడు సత్యనారాయణ భార్య రామలక్ష్మి 15 ఏళ్ల క్రితం మరణించడంతో అదే గ్రామానికి చెందిన మణికుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఆ గ్రామంలోనే వేరే ఇంట్లో సత్యనారాయణ, మణికుమారి నివాసం ఉంటున్నారు. సత్యనారాయణకు శ్రీనివాస్, రామశివాజీ, హరికృష్ణ అనే కుమారులతోపాటు కుమార్తె చంద్రకళ ఉన్నారు. వీరందరికీ వివాహాలు కావడంతో తణుకు పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. శ్రీనివాస్, రామశివాజీ గ్రామంలోని వయ్యేరు కాలువ గట్టు సమీపంలో బాణసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. గతంలో అక్కడే పనిచేసిన అనుభవం ఉన్న సత్యనారాయణ అక్కడి నుంచి ముడిసరుకు తెచ్చుకుని ఇంటి వద్దే బాణసంచా తయాచే చేసి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాడని స్థానికులు తెలిపారు. 2013లో ఇదే గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు.
రక్షించే అవకాశం లేక.. : దువ్వ గ్రామంలోని మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో తాటాకింట్లో సత్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి యజమాని తన సామగ్రిని ఒక పోర్షన్‌లో భద్రపరచుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇంటిని ఆనుకుని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండటం, ప్రమాదం జరిగిన సమయంలో పెద్దఎత్తున బాణాసంచా పేలడంతో గ్రామస్తులు వారిద్దరినీ రక్షించే సాహసం చేయలేకపోయారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. భార్యాభర్తలు ఒకే గదిలో బొగ్గులా మాడి ఉండటం చూపరులను  కలచివేసింది. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 
 
ఆద్యంతం నిర్లక్ష్యమే..
బాణసంచా తయారీ కేంద్రాల్లో కనీస నిబంధనలు పాటించకపోవడం.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి సీజన్‌లో హడావుడి చేయడం మినహా ఆ తర్వాత వీటి గురించి పట్టించుకునే నాథులు ఉండటం లేదు. ఫలితంగా బాణసంచా తయారీ కేంద్రాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
l 2010లో ఉంగుటూరు మండలం వెల్లమిలి్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 8మంది మృత్యువాత పడ్డారు. ఈ గ్రామం తాటాకు టపాసుల తయారీ కేంద్రంగా పేరొందింది. దాదాపు 40 కుటుంబాలు దీపావళికి రెండు, మూడు నెలలు ముందు నుంచే టపాసుల తయారీలో నిమగ్నమై ఉంటారు. ఈ ఘటన అనంతరం అప్పటి ఎస్సైను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 
l 2010లో పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో అనుమతులు లేకుండా ఒక ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఖండవల్లి గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు. 
l 2012లో ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సత్యనారాయణ అనే వ్యక్తి అన«ధికారికంగా బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
l 2013లో తణుకు మండలం దువ్వలో బాణసంచా 
తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. 
 
మరిన్ని వార్తలు