సందేశాత్మకం

27 Aug, 2016 23:38 IST|Sakshi
సందేశాత్మకం
నిర్మల్‌ రూరల్‌ : ‘అయ్యో..! నాడబ్బులు పోయాయి.. ఇప్పడిదిప్పుడే నా ఏటీఎం కార్డు మార్చేసిండ్రు. నా అకౌంట్‌లో ఉన్న పైసలన్నీ  డ్రాజేసి ఎత్తుకెళ్లిండ్రు.. ఇదెక్కడి అన్యాయం..’ ఇది ఏటీఎం మోసగాళ్ల బారిన పడ్డ ఓ బాధితుడి ఆక్రందన. ‘ఇప్పుడేం చేయాలిరా దేవుడా..!  ‘మేం అడిగిన వివరాలు చెబితే.. మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి’ అని కాల్‌ చేశారు.. ఊరికే కాసులు వస్తాయని కక్కుర్తిపడి ఉన్న విషయాలన్నీ చెప్పిన. ఇప్పుడు నా ఖాతాలో నుంచే ఉన్న డబ్బులు ఖాళీ చేసిండ్రు. ఎవరికి చెప్పుకోను నా గోస.. అంటూ ఫేక్‌కాల్‌ బారిన పడ్డ బాధితుడి ఆవేదన
           ఇలా నిత్యం సమాజంలో ఎన్నో నేరాలు, మరెన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అవగాహన లేక కొందరు.. అత్యాశ, అమాయకత్వంతో మరికొందరు మోసగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. ఇలాంటి వాటిపై ఏదైనా చేయాలి.. సమాజంలో జరుగుతున్న నేరాలపై కళ్లకు కట్టించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్న తలంపుతో షార్ట్‌ల్మ్స్‌కు శ్రీకారం చుట్టాడు కాండ్రె రాంరాజ్‌. పట్టణంలోని బేస్తవార్‌పేట్‌కు చెందిన కాండ్రె సుష్మ, ప్రేంరాజ్‌ దంపతులు కుమారుడైన రాంరాజ్‌ చదువు పూర్తికాగానే కెమెరా చేతపట్టాడు. వీడియోగ్రఫీపై ఇష్టంతో ఆ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. బతుకుదెరువుకు ఉపయోగపడుతున్న ఈ వీడియోగ్రఫీని సమాజ శ్రేయస్సుకూ ఉపయోగించాలకున్నాడు. నేరాలు, ఘోరాలపై తన ఆలోచనలకు స్థానిక పోలీసుల నుంచి పూర్తి సహకారం అందడంతో రంగంలోకి దిగాడు. 
వరుసగా షార్ట్‌ఫిల్మ్స్‌..
నిర్మల్‌ డీఎస్పీ మనోహర్‌రెడ్డి, పట్టణ సీఐ జీవన్‌రెడ్డి, ఎసై ్సల సహకారం, సూచనలతో తన స్క్రిప్ట్‌లను తెరకెక్కించాడు. రోడ్డుభద్రత వారోత్సవాల నేపథ్యంలో ‘హెల్మెట్‌’పై షార్ట్‌ఫిలిమ్‌ తీశాడు. హెల్మెట్‌ ధరించడం వల్ల లాభం.. లేకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటో దీని ద్వారా వివరించాడు. దీన్ని స్థానిక ఛానల్స్‌లో ప్రసారం చేయడం, ప్రజల్లో మంచి రెస్పాన్స్‌ రావడంతో రెట్టింపు ఉత్సాహంతో రాంరాజ్‌ మరిన్ని రచనలు సిద్ధం చేశాడు. మళ్లీ పోలీసులు పూర్తిసహకారం అందించారు. వరుసగా రోడ్డుభద్రత, ఏటీఎంలలో మోసాలు జరుగుతున్న తీరు, ఫేక్‌కాల్స్, ఆన్‌లైన్‌ మోసాలు..
        ఇలా పలురకాల నేరాలపై చిన్నచిత్రాలను, ఆడియో, వీడియో సీడీలను రూపొందించాడు. ఈ చిత్రాలు సహజంగా వచ్చేందుకు స్థానిక పోలీసులనే పాత్రధారులుగా ఎంచుకోవడం గమనార్హం. వీటితో పాటు పలు ఇతర షార్ట్‌ఫిలిమ్స్‌నూ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు తనతో పాటు జి.రాజశేఖర్, మహేశ్, లక్ష్మణ్, సాయిసింగ్, గోపివర్మ, కపిల్‌రాథోడ్, అఖిల్, మురళీ, గాయకుడు ఎలిశెట్టి సుదర్శన్‌ల సహకారంతో ముందుకు సాగుతున్నాడు. 
ప్రశంసించిన ఎస్పీలు..
పట్టణ పోలీసులు, రాంరాజ్‌ కలిసి రూపొందించిన సందేశాత్మక షార్ట్‌ఫిలిమ్స్‌ సీడీలను గత ఎస్పీ తరుణ్‌జోషి, ప్రస్తుత ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఆవిష్కరించారు. వీటిని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిత్రీకరించిన రాంరాజ్‌ను ఇద్దరు ఎస్పీలూ అభినందించారు. శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలనూ అందించారు. పట్టణంలోనూ డీఎస్పీ, సీఐ, ఎసై ్సలు రాంరాజ్‌ అండ్‌ టీమ్‌ను ఘనంగా సన్మానించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సైతం రాంరాజ్‌ తీసిన సందేశాత్మక షార్ట్‌ఫిల్మ్స్‌ను ప్రశంసించారు. ప్రజోపయోగం ఉన్న వీటిని ప్రస్తుతం లోకల్‌ ఛానల్స్‌లో ప్రసారం చేస్తుండడం విశేషం.
వినూత్నంగా చేయాలని.. 
నేను ఎంచుకున్న వీడియోగ్రఫీ ఫీల్డ్‌లో ఉంటూనే సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకున్నాను. అందుకే చేతిలోని కెమెరాతోనే వినూత్నంగా ముందుకు వెళ్లాలనుకున్నాను. నా కాన్సెప్ట్స్‌కు పట్టణ పోలీసుల సహకారం లభించడం, వారూ కొన్ని సూచనలు చేయడంతో సందేశాత్మక షార్ట్‌ఫిల్మ్స్‌ రూపొందించాను. ఇద్దరు ఎస్పీలు, మరెందరో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడం చాలా సంతప్తినిచ్చింది. మున్ముందు మరిన్ని చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినిచ్చింది.
                                                  కాండ్రె రాంరాజ్, షార్ట్‌ఫిల్మ్స్‌ డైరెక్టర్‌
 
ఈ ‘దాహం..’ తీరనిది..
నిర్మల్‌ రూరల్‌ :  సకల ప్రాణకోటికి జీవనాధారం నీళ్లు. ప్రస్తుతం ఆ నీళ్లని అవసరానికి మించి వాడుతున్నం. కానీ కొన్ని గ్రామాలు తాగడానికి నీళ్లు దొరకక ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాంటి ఓ గ్రామం కథే ఈ.. ‘దాహం’ అంటూ 7నిమిషాల 30సెకన్లలోనే.. ఒక్క ముక్కమాట లేకుండా.. కేవలం హావభావాలతో నీళ్లకున్న ప్రాధాన్యం, నీటిచుక్క లేక ప్రాణం విడుస్తున్న అడవిపల్లెల గుండెచప్పుడును కళ్లకు కట్టించారు. ఆ పల్లెల దాహం తీరుతుందో.. లేదో.. తెలియదు. కానీ.. సమాజానికి ఏదో చేయాలన్న ఈ ‘నలుగురు’ కుర్రాళ్ల దాహం మాత్రం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది.
ఫ(ఫో)ర్‌ ది పీపుల్‌.. ఏదైనా చేయాలి
చుట్టూ ఉన్న ప్రజా సమస్యలు.. దేశంలోని సమకాలీన పరిస్థితులే వారి చిత్రాలకు మూలాలు. మొదట నలుగురు కలిసి నలుగురికి ఉపయోగపడేలా.. ఫ(ఫో)ర్‌ ది పీపుల్‌ అని ఓ బ్యానర్‌ పెట్టుకుని ముందడుగేశారు. ఇందుకు మూలకారకుడు హరిచరణ్‌. నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన మౌర్య ఇందిరవదన, పార్థసారథి దంపతుల కుమారుడైన మౌర్య హరిచరణ్‌ బీఎఫ్‌ఏ పూర్తిచేశాడు. నిత్యం ఏదో సామాజిక అంశంపై హరిచరణ్, ఆయన స్నేహితులు బారడ్‌ గౌరవ్, తూము సంపత్, బారడ్‌ సౌషిల్‌లు చర్చించేవారు. ఇలా మాటలతోనే కాలం గడిపితే ఏం లాభం.. అన్న ఆలోచనల్లో నుంచి పుట్టిందే షార్ట్‌ఫిల్మ్‌ రూపకల్పన. 
‘దాహం’తో మొదలు
హరిచరణ్‌ రచన, కథ, కథనం.. ఎలా చేయాలో పూర్తిగా సిద్ధం చేశాడు. ఇందుకు స్నేహితులతో పాటు కళాకారుడు మహేశ్‌ చేతులు కలిపాడు. ముందుగా జిల్లాలో వేసవి వస్తే నీళ్లచుక్క కోసం తల్లడిల్లే గోండుగూడేల గోడును తెరకెక్కించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ‘దాహం’ పేరుతో కేవలం 7నిమిషాల నిడివిలోనే అర్థవంతమైన చిన్నచిత్రాన్ని రూపొందించారు. ఎలాంటి మాటలు లేకున్నా ఆద్యంతం హావభావాలతోనే సాగిన ఈ ఫిల్మ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ‘దాహం నిర్మల్‌’ పేరుతో అప్‌లోడ్‌ చేసిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ వేలాది వీక్షకులను ఆకట్టుకుంటోంది. 
జాతి పతాక గౌరవం.. జనగణమన
హరిచరణ్‌ అండ్‌ టీమ్‌ తెరకెక్కిస్తున్న రెండో షార్ట్‌ఫిల్మ్‌ జనగణమన. దాదాపు షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిన్నచిత్రం ఆగస్ట్‌15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలయ్యింది. దేశంలో ఎన్ని కులాలున్నా.. ఎన్ని మతాలున్నా.. అందరూ చేతులెత్తి సెల్యూట్‌ చేసేది ఒక్క మువ్వన్నెల జెండాకే.. అన్న సందేశంతో దీన్ని చిత్రీకరించారు. ఇటీవల కశ్మీర్‌లో జాతీయజెండాకు అవమానం జరగడం, భిన్నత్వంలో ఏకత్వం.. ఇలాంటి సామాజిక, సమకాలీన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడైన హరిచరణ్‌ పేర్కొన్నాడు.
మున్ముందు మరిన్ని..
తమదైన శైలిలో సమాజానికి మెసేజ్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో హరిచరణ్‌ మిత్రబృందం ఆలోచనలు చేస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడుతున్న ఈ యువత.. తమ చిత్రాలకు తాము సంపాదించిన డబ్బులనే పెట్టుబడిగా పెడుతోంది. రూపాయి కూడా ఆశించకుండా సమాజం కోసం నిస్వార్థంగా తమవంతు కృషిచేస్తామంటోంది.
             మౌర్య హరిచరణ్, షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌
ఏదో చేయాలి.. ఏదో సాధించాలి.. అన్న తపనే మమ్మల్ని షార్ట్‌ఫిల్మ్ప్‌ వైపు నడిపించింది. దాహం చిత్రం మాకు చాలా పేరుతెచ్చింది. మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇదే ఊపుతో జనగణమన రూపొందించాం. మున్ముందు పెద్ద సినిమా స్థాయికి ఎదగాలని, జనాలందరికీ మా సందేశం అందించాలన్నదే మా లక్ష్యం.
 
 
మరిన్ని వార్తలు