కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కేసులు

9 Sep, 2016 01:07 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోకల అశోక్‌కుమార్‌
 
– తుని ఘటనతో కరుణాకరరెడ్డికి సంబంధమేమిటి?
– కాపునాడు రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్‌
 
తిరుపతి మంగళం: కాపులను బీసీల్లో చేర్చాలని చేపడుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకే మద్దతు తెలిపిన వారిపై కేసులు బనాయిస్తున్నారని కాపునాడు రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేర్చుతానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోకపోవడంతో కాపు రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నట్టు తెలిపారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపిన వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డిపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యమానికి ముందు మద్దతు తెలిపిన కరుణాకరరెడ్డికి, తుని ఘటనకు సంబంధమేమిటని ప్రశ్నించారు. అనంతరం కాపు నాయకుడు దుద్దేల బాబు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందన్న విషయం కూడా టీడీపీ సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్యకు తెలియకపోవడం బాధాకరమన్నారు. అందులో భాగంగానే కరుణాకరరెడ్డి కాపులకు మద్దతు తెలిపారే తప్ప విధ్వంసాలు చేయించలేదన్నారు. కాపు ఉద్యమాలను నీరుగార్చేందుకు చంద్రబాబే టీడీపీ నాయకులతో తగలబెట్టించారని ఆరోపించారు. అనంతరం కాపు నగర అధ్యక్షుడు ముద్రనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్న కరుణాకరరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. కేసులకు, విచారణకు కరుణాకరరెడ్డి భయపడే వ్యక్తి కాదన్నారు. కాపులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చకపోతే అసలైన ఉద్యమాలను చూడాల్సి వస్తుందని కాపు నాయకులు బాలిశెట్టి కిషోర్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో కాపు నాయకులు బండ్ల లక్ష్మీపతి, రామూర్తిరాయల్, శివరాయల్, రమేష్‌ పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు