అంతా నేరమయం

24 Mar, 2016 04:11 IST|Sakshi
అంతా నేరమయం

జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు
ఆగని ఎర్రచందనం  అక్రమ రవాణా
నేరాల నియంత్రణకు   పటిష్ట ప్రణాళిక అవసరం

కడప అర్బన్: జిల్లాలో ఇటీవలి కాలంలో నేరాలు పెరిగాయి. దొంగతనాలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లు విపరీతంగా జరుగుతున్నాయి. దొంగతనాలను అరికట్టడంలో జిల్లా పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అపారమైన ఎర్రచందనం సంపదను అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లు దోచుకెళుతున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాటీ నేతృత్వంలో గత ఏడాది ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ విభాగం (ఆర్‌ఎస్‌టీఎఫ్) ఆధ్వర్యంలో అప్పటి ఓఎస్‌డీ రాహుల్‌దేవ్‌శర్మ, ప్రస్తుత ఓఎస్‌డీ సత్య ఏసుబాబులు తమ సిబ్బందితో అంతర్జాతీయ, జాతీయ స్థాయి స్మగ్లర్లను అరెస్టు చేసి కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ నిత్యం ఎర్రచందనం తరలిపోతూనే ఉంది.

2014లో 152 దొంగతనాలు జరగ్గా, వాటిలో ఇంకా 41 దొంగతనాల గురించి పోలీసులు తేల్చలేకపోయారు. 77 హత్యలు జరగ్గా ఇంకా 57 హత్యల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. 10 హత్య కేసులు విచారణలో ఉన్నాయి. 31 కిడ్నాప్ కేసులు నమోదు కాగా వాటిలో 6 కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. 29 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 22 కేసులకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. 212 చీటింగ్ కేసులు నమోదు కాగా, 345 కేసులను కోర్టులో విచారిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల ద్వారా 616 మంది మృతి చెందారు. మొత్తం 5924 కేసులు నమోదు కాగా, 1852 కోర్టులో విచారణలో ఉన్నాయి. 301 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 353 పోలీసు దర్యాప్తులో ఉన్నాయి.

2015లో దొంగతనాలు 198 జరగ్గా, 91 కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి. 107 పోలీసు స్టేషన్లలో విచారణలో ఉన్నాయి. 66 హత్యలు జరగ్గా 41 కోర్టులో విచారణలో ఉన్నాయి. 26 కేసులను పోలీసులు దర్యాప్లు చేస్తున్నారు. కిడ్నాప్ కేసులు 41 నమోదుకాగా, 22 కోర్టుల్లోనూ, 12 పోలీసుస్టేషన్లలోనూ విచారిస్తున్నారు. అత్యాచారం కేసులు 33 కాగా, 17 కోర్టుల్లోనూ, 16 పోలీసుస్టేషన్లలోనూ విచారిస్తున్నారు. 297 చీటింగ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 61 కోర్టుల్లోనూ, 177 పోలీసుస్టేషన్లలోనూ విచారిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో 453 మంది మృతి చెందగా, 232 కోర్టులోనూ, 112 పోలీసుస్టేషన్లలోనూ ఇంకా విచారణ కొనసాగుతోంది. జిల్లా మొత్తం మీద 2015లో 8614 కేసులు నమోదు కాగా, 2212 కేసులు కోర్టులో విచారిస్తున్నారు. 1839 పోలీసు స్టేషన్లలో విచారణ కొనసాగుతోంది.

2016వ సంవత్సరం ఈ నెల 21వ తేదీ వరకు 1642 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 52 దొంగతనాల కేసులు, 17 హత్యలు , 211 రోడ్డు ప్రమాదాలు, 7 కిడ్నాప్‌లు ఉన్నాయి.

 పోలీసులపై పనిభారం
జిల్లాలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు మూడు వేల మందికి పైగా పనిచేస్తున్నారు. హోం గార్డులు 900 మంది పనిచేస్తున్నారు. జిల్లా జనాభా సుమారు 30 లక్షలు కాగా, కనీసం ప్రతి వెయ్యి మందికి ఒక పోలీసు కూడా లేరు. అంతేకాకుండా వివిధ రకాల బందోబస్తులు, అంతర్‌జిల్లా, జిల్లా స్థాయి బందోబస్తులు నిరంతరం ఉంటూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలీసులపై మరింత భారం పడింది. దీనికితోడు నేరస్తులు రకరకాల పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతూ ఎప్పటికప్పుడు పోలీసులకు సవాలుగా మారుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో నేరాల నివారణకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రికార్డులను పరిశీలిస్తే 2015 సంవత్సరంలో ట్రిపుల్ సీ (సెంట్రల్ కంప్లైంట్ సెల్)కు 4255 ఫిర్యాదులు రాగా, వాటిల్లో 4166 పరిష్కరించారు. ఇంకా 89 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 సంవత్సరం ఇప్పటివరకు 937 ఫిర్యాదులు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు రాగా, 521 ఫిర్యాదులను పరిష్కరించారు. ఇంకా 416 పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఎక్కువ భాగం పోలీసు స్టేషన్లలో నిజమైన బాధితులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుకుబడి, అధికారం, డబ్బు ఉన్న వారికే న్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు స్పందించినా కింది స్థాయి సిబ్బంది సరిగా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు