నీటమునిగిన పంటలు

2 Aug, 2016 20:28 IST|Sakshi
నీటమునిగిన పంటలు
రేపల్లె : సాగునీరు అందక, వర్షాలు లేక ఒక ప్రాంత రైతులు ఆందోళన చెందుతుంటే మరో ప్రాంత రైతులు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగి తల్లడిల్లిపోతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ పరిధిలోని రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల పరిధిలో సుమారు 40 వేల హెక్టార్లలో వరిసాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు నారుమళ్ళు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామంలో వేసవిలో వేసిన వేరుశనగ, మోటార్ల సాయంతో వేసిన వరినారుమళ్లు నీట మునిగి పంట నీటిలో నానుతుండటంతో రైతులకు కంటతడి పెడుతున్నారు. రాంబొట్లవారిపాలెం, కావూరు, తుమ్మలపాలెం గ్రామపంచాయితీల పరిధిలో  సుమారు 500 ఎకరాల వరకు వేరుశనగ సాగు చేస్తున్నారు. రాంబొట్లవారిపాలెం గ్రామపంచాయితీ పరిధిలోని చిన్న, సన్నకారు రైతులు 100 మంది సుమారు 200 ఎకరాలలో వేరుశనగ వేశారు. మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తున్న తరుణంలో కురిసిన వర్షాలకు పంట చేలలోకి నీరు చేరి వేరుశనగ పంట కుళ్లిపోయే దశకు చేరింది.
మరిన్ని వార్తలు