ముంపునకు గురవుతున్న పంటలు

26 Jul, 2016 17:55 IST|Sakshi
ముంపునకు గురవుతున్న పంటలు

భారీగా నష్టపోతున్నామని రైతుల మొర

బషీరాబాద్‌: కష్టపడి పండించిన పంటలు నీట మునగడంతో నష్టపోతున్నామని మంగళవారం గిరిజన రైతులు అధికారులకు మొర పెట్టుకున్నారు. మండలంలోని కుప్పన్‌కోట్‌ గ్రామానికి చెందిన గోవిందప్ప, హీర్యానాయక్‌, మున్యానాయక్‌, శివ్యానాయక్‌ల తదితర రైతులు మండల కార్యాలయాల్లో ఉన్న అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రమీలకు వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్‌ 30లో ఉన్న 14.39 ఎకరాల పట్టా భూమిలో పండిస్తున్న పెసర, కంది పంటలు కుంటలో నిలిచిన నీటి కారణంగా ముంపునకు గురయ్యాయని అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. ఏపుగా పెరిగిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేదని ఎంపీడీఓ రైతులకు తెలిపారు. అనంతరం రైతులు తహసీల్దార్‌ తులసీరాంను కలిశారు. రైతులు తమ గోడును వినిపించారు. కుంటలు చెరువులు ఉన్న చోట్ల పంటలు వేయవద్దని, చెరువుల్లో నీరు లేనప్పుడే పంటలను సాగు చేయాలని తహసీల్దార్‌ రైతులకు చెప్పారు. తమ పంటలను పరిహారం అందించాలని రైతులు కోరడంతో.. వర్షాకాలంలో పంటలు వేసుకోవద్దని తెలిసిన ఎందుకు వేసుకున్నారని ప్రశ్నించారు.  కుంటలో ఉన్న నీటిని తోడేసి పంటలను కాపాడుకుంటామని రైతులు అడిగారు. కుంటలో ఉన్న నీటిని తొలగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రైతులకు చెప్పారు.

మరిన్ని వార్తలు